Prayagraj: యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది దుర్మ‌ర‌ణం!

10 Kumbh Devotees Killed in Car Bus Collision on Highway in Prayagraj
  • యూపీలోని మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై ప్ర‌మాదం
  • ఛత్తీస్‌గఢ్ నుంచి కుంభమేళాకు వెళుతున్న భ‌క్తులు
  • వారు ప్ర‌యాణిస్తున్న బొలెరో.. ట్రావెల్ బ‌స్సును ఢీకొట్టిన వైనం
  • మరో 19 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు భ‌క్తుల‌తో వెళుతున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బ‌స్సును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది భ‌క్తులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మ‌రో 19 మంది గాయ‌ప‌డ్డారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో మేజా స‌మీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. 

చ‌నిపోయిన భక్తులు ఛత్తీస్‌గఢ్ లోని కోర్బాకు చెందినవారు. వారు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి కుంభమేళాకు వెళుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఇక ప్రమాదం జరిగిన బస్సులో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ నుంచి వచ్చిన యాత్రికులు ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో బొలెరో నుజ్జునుజ్జుయింది. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. 

"ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు భక్తులతో వెళుతున్న కారు బస్సును ఢీకొట్టడంతో పది మంది మృతిచెందారు. ప్రయాగ్‌రాజ్-మిర్జాపూర్ హైవేపై అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్వరూప్ రాణి మెడికల్ ఆసుప‌త్రికి తరలించాం. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది" అని ప్రయాగ్‌రాజ్ అదనపు ఎస్పీ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు.

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్య‌క్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇక గ‌త నెల 13న ప్రారంభ‌మైన మ‌హాకుంభ‌మేళాకు భ‌క్తులు పోటెత్తుతున్నారు. ఇప్ప‌టికే 50కోట్ల‌కు పైగా భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచ‌రించారు. ఈ నెల 26 వ‌ర‌కు కుంభ‌మేళా జ‌ర‌గ‌నుంది. 
Prayagraj
Uttar Pradesh
Mahakumbh Mela

More Telugu News