Nara Lokesh: పద్మావతి వర్సిటీలో రూ.7.5 కోట్లతో అధునాతన ఇండోర్ స్టేడియం ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh inaugurates multi purpose indore stadium in Padmavathi University
  • తిరుపతిలో నారా లోకేశ్ పర్యటన
  • క్రీడలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తామని వెల్లడి
  • కొత్త స్టేడియంను క్రీడాకారిణులు వినియోగించుకోవాలని సూచన
రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వం, మహిళా యూనివర్సిటీ, శాప్ సంయుక్తంగా రూ.7.5 కోట్లతో నిర్మించిన ఖేలో ఇండియా మ‌ల్టీప‌ర్ప‌స్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి లోకేశ్ నేడు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన.... అమరావతిలో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పద్మావతి యూనివర్సిటీ వేదికగా ఉత్తమ క్రీడాకారిణులను తయారుచేసేందుకు కొత్తగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణులతో మంత్రి లోకేశ్ కొద్దిసేపు షటిల్ ఆడి ఉత్సాహ పర్చారు. 

అధునాతన సౌకర్యాలతో ఏర్పాటుచేసిన ఏరోబిక్స్, తైక్వాండో, యోగా మెడిటేషన్ సెంటర్లను కూడా లోకేశ్ ప్రారంభించారు. యూనివర్సిటీ విద్యార్థినులు, క్రీడాకారిణులు ఇక్కడ ఏర్పాటుచేసిన క్రీడా వసతులను వినయోగించుకుని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. 

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమ మాట్లాడుతూ, క్రీడాకారిణులకు యూనివర్సిటీలో మంచి శిక్షణ వేదిక లభించడం తమ విద్యార్థినులకు గొప్ప అవకాశమన్నారు. 

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ... రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. క్రీడాభివృద్ధికి మంత్రి లోకేశ్ చూపుతున్న చొరవ, కృషి అభినందనీయమని అన్నారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, శాప్ ఎండీ గిరీషా, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, యూనివర్సిటీ రిజిస్ట్రార్ రజని తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Indore Stadium
Padmavathi University
Tirupati

More Telugu News