YS Sharmila: గ్రూప్-2 అభ్యర్థుల పరిస్థితిని పట్టించుకోరా?: షర్మిల

Sharmila demands Chandrababu govt should call Group2 candidates for talks
  • గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళనలపై షర్మిల స్పందన
  • రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దాలంటూ అభ్యర్థుల డిమాండ్
  • ఏపీపీఎస్సీ మొండిగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న షర్మిల 
గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళనలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. గ్రూప్-2 అభ్యర్థులతో చంద్రబాబు ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు. 2023 డిసెంబరు 11వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. తప్పులను సరిదిద్దకుంటే నష్టం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. 

"న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. రోస్టర్ విధానంలో తప్పుల తడకతో ఝార్ఖండ్ తరహాలో నోటిఫికేషన్ రద్దయి ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవుతాయని అభ్యర్థులు భయపడుతున్నారు. తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుతున్నారు. 

మరోవైపు అడ్వొకేట్ జనరల్ సైతం తప్పులు ఉన్నాయని కోర్టులో ఒప్పుకుంటే... హడావిడిగా ఈ నెల 23న పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏపీపీఎస్సీ మొండిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏంటి? రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తిని పట్టించుకోరా? 

రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశంపై మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలి. ఆందోళనలో ఉన్న గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులను పిలిచి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం" అంటూ షర్మిల ట్వీట్ చేశారు. గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులు ఆందోళన చేపడుతున్న వీడియోను కూడా పంచుకున్నారు.
YS Sharmila
Group-2 Mains
Chandrababu
Andhra Pradesh

More Telugu News