Flight Accident: ఒక ఫ్లైట్ ల్యాండవుతుండగా రన్ వే పైకి మరో విమానం.. తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో ఇదిగో!

Pilot Aborts Landing To Avoid Collision With Another Jet On Runway In Chicago
  • విమానం నేలను తాకీతాకగానే మళ్లీ టేకాఫ్ చేసిన పైలట్
  • అమెరికాలోని షికాగో విమానాశ్రయంలో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
షికాగో విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఒక విమానం ల్యాండవుతున్న సమయంలో రన్వేపైకి మరో విమానం అడ్డంగా రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే తన విమానాన్ని తిరిగి టేకాఫ్ చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం అమెరికాలోని షికాగో విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అసలేం జరిగిందంటే.. ఒమాహా నుంచి బయలుదేరిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం మంగళవారం ఉదయం 8:47 గంటలకు షికాగోలోని మిడ్ వే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండవుతోంది. విమానాశ్రయంలోని రన్‌వే 31సీపై దిగుతుండగా ఇదే రన్ వేపై ఛాలెంజర్ 350 ప్రైవేట్ జెట్ అడ్డంగా వెళుతోంది. చివరిక్షణంలో ఈ జెట్ ను గమనించిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం పైలెట్ మళ్లీ టేకాఫ్ తీసుకున్నాడు. 

దీంతో రెండు విమానాలు ఢీ కొనే ప్రమాదం తప్పింది. రెండో ప్రయత్నంలో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం క్షేమంగా ల్యాండయింది. ఈ ఘటనపై దర్యాఫ్తు చేపట్టిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.. సదరు ప్రైవేట్ జెట్ పైలట్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా రన్ వేపైకి వచ్చాడని ప్రాథమికంగా తేల్చారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Flight Accident
Viral Videos
Chicago
America
Airport
Landing
Takeoff

More Telugu News