Indian Railways: జనరల్ టికెట్లనూ ఆన్ లైన్ లో తీసుకోవచ్చు.. 3 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్న రైల్వే

Book unreserved And platform tickets from anywhere on mobile app
  • యూటీఎస్ యాప్ తో అవకాశం కల్పించిన రైల్వే శాఖ
  • జనరల్ బోగీ టికెట్ల కోసం హైరానా పడక్కర్లేదంటున్న అధికారులు
  • మొబైల్ ద్వారానే టికెట్ తీసుకోవచ్చని వివరణ
రైల్వే స్టేషన్లలో జనరల్ టికెట్ల కోసం రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. చాంతాడంత క్యూలలో నిలుచుని టికెట్ తీసుకునేసరికి ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయిన సందర్భాలు కూడా వుంటాయి. దీనికి పరిష్కారంగా రైల్వే శాఖ పెద్ద స్టేషన్లలో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ వంటి పెద్ద స్టేషన్లలో ఈ వెండింగ్ మెషిన్ల వద్ద కూడా ఎప్పుడు చూసినా పెద్ద గుంపే ఉంటుంది. ఈ క్రమంలోనే అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టం (యూటీఎస్) యాప్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటూ రైల్వే శాఖ సూచిస్తోంది.

2016 లోనే ఈ యాప్ ను రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ యాప్ వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో 3 శాతం క్యాష్ బ్యాక్ కూడా ప్రకటించింది. జనరల్ టికెట్లను మొబైల్ ఫోన్ ద్వారా కొనుగోలు చేసే సదుపాయం కల్పించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. తొలుత జంట నగరాలలోని 26 సబర్బన్ స్టేషన్లకు పరిమితమైన ఈ యాప్ 2018 జులైలో అన్ని స్టేషన్లను కవర్ చేసేలా అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. జనరల్ టికెట్లతో పాటు ప్లాట్ ఫాం టికెట్లను కూడా ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయొచ్చని చెప్పారు. 

ప్రయాణికులకు సులువుగా ఉండేందుకు ఆర్‌-వాలెట్‌, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, ఇంటర్నెంట్‌ బ్యాంకింగ్ వంటి డిజిటల్‌ మోడ్‌ల ద్వారా టికెట్ డబ్బులు చెల్లించే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తుంది. ఆర్ వాలెట్ లో రూ.20 వేల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కూడా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. వాలెట్ ద్వారా కొనుగోలు చేసే టికెట్లపై 3 శాతం క్యాష్ బ్యాక్ సదుపాయం ఉందన్నారు. 

ఇంటి నుంచే జనరల్ టికెట్ కొనుగోలు చేయడానికి యూటీఎస్ యాప్ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. మొబైల్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని టికెట్ కొనుగోలు చేయవచ్చన్నారు. యాప్ డౌన్ లోడ్ చేసుకునే ఉద్దేశం లేకపోతే, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్ వద్ద ఉన్న యూటీఎస్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కూడా టికెట్ కొనుగోలు చేసే వీలును కల్పించినట్లు వివరించారు.
Indian Railways
General Tickets
Mobile App
UTS

More Telugu News