Chandrababu: మొన్నటి ఎన్నికల్లో కరెక్ట్ గా చేసుంటే పులివెందుల కూడా మనదే అయ్యేది: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu said that if the party works properly TDP will also capture Pulivendula
  • జీడీ నెల్లూరులో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం 
  • ఇక క్రమం తప్పకుండా కార్యకర్తలను కలుస్తుంటానని వెల్లడి
  • కార్యకర్తల వల్లే ఎన్నికల్లో విజయం దక్కిందని వ్యాఖ్యలు
  • వైసీపీ నేతలకు సాయం చేస్తే పాముకు పాలు పోసినట్టేనని స్పష్టీకరణ
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో నేడు పేదల సేవలో కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలను చూస్తే తనకు కొండంత ధైర్యం వస్తుందని అన్నారు. గత 8 నెలలుగా పరిపాలనలో నిమగ్నమయ్యానని, అందుకే పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయానని వివరణ ఇచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు కుటుంబ సమానులైన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. 

"30 ఏళ్ల తర్వాత జీడీ నెల్లూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేశాం. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేశారు. మీకు నేను పూర్తిగా సహకరిస్తా. ఈ నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా మార్చాలి. తంబళ్లపల్లి, పుంగనూరులో కొంచెం గురి తప్పాం తప్ప జిల్లా అంతటా టీడీపీ జెండా ఎగిరింది. వై నాట్ 175, వై నాట్ కుప్పం అన్నవాళ్లు ఇప్పుడు ఏమయ్యారు.? మొన్నటి ఎన్నికల్లో సరిగా చేసుకుని ఉంటే పులివెందులలోనూ మనమే గెలిచేవాళ్లం. 

పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. ఈసారి మనం పకడ్బందీగా వ్యవహరించడంతో ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు గెలిచాం. మిమ్మల్ని, నన్ను ఎన్ని ఇబ్బందుల పెట్టినా ప్రాణాలు పోయినా పర్వాలేదు గానీ, వారికి లొంగబోమని పోరాడటంతో 93 శాతం సీట్లు గెలిచాం" అని వివరించారు.  

ఆ రోజు టీడీపీని నేనే ఓడించుకున్నా

2004, 2019లో పార్టీని నేనే ఓడించుకున్నా. రాష్ట్రాన్ని బాగు చేయాలని, ప్రజల తలరాతలు మార్చాలని మిమ్మల్ని (కార్యకర్తలను) పట్టించుకోకుండా పని చేశా. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలబెట్టా. 2004లో ఓడిపోయాక అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టింది. మళ్లీ 2014లో చాలా సమస్యలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవడం చారిత్రాత్మక అవసరం. కానీ సమైక్య ముసుగులో వైసీపీ విభజన కోరుకుంది. అయినా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మనల్ని గెలిపించారు. 

2014-2019 మధ్య అవిశ్రాంతంగా పనిచేసి 13.5 గ్రోత్‌రేట్ సాధించాం. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందంటే దానికి కారణం ప్రజలకు మంచి చేయకపోవడం వల్ల కాదు... కార్యకర్తల్లో అసంతృప్తి వల్లే. మీలో అనువణువు పసుపు రక్తం తప్ప మరొకటి ఉండదు. మీతో నేను మాట్లాడకుంటా ఉంటే మీరు కూడా నాపై అసంతృప్తిలో ఉంటారు. అందుకే కార్యకర్తల కోసం సమావేశం ఏర్పాటు చేశాను.

నాకు, కార్యకర్తలకు మధ్య  దూరం ఉండదు

మునుపు ఎన్నికలయ్యాక కేడర్ కోసం ఆలోచించలేకపోయాం. కానీ ఈసారి కార్యకర్తలకు, నాకు గ్యాప్ ఉండదు. పర్యటనకు వెళ్లిన ప్రతిచోటా కార్యకర్తలు, నేతలతో సమావేశమవుతా. ప్రభుత్వంలో ఉన్న మనం ప్రజల కోసం ఏం చేస్తున్నామో చెప్పడానికి కూడా సోషల్ మీడియా ఒక ఆయుధం...ప్రజలకు సమాచారం త్వరగా చేరవేయడంలో కీలకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి.

వారికి మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టే

వైసీపీ నేతలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపకారం చేసే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయం నేతలకు నేరుగా, గట్టిగా చెబుతున్నా. వైసీపీకి ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్లే. శ్రేణులు కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు కాకుండా నాయకత్వం కింద పనిచేయాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు వన్ టైంగా చూసుకోవద్దు. మీరు రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు ప్రజాప్రతినిధులుగా ఉండాలి. కార్యకర్తలకు మీరు అండగా ఉండాలి, అందుబాటులో ఉండాలి.

నాకు ఎన్ని పనులున్నా ఎక్కడికెళ్లినా కార్యకర్తలను కలవడం బాధ్యతగా పెట్టుకుంటా. మొన్నటి ఎన్నికల్లో నా మిత్రులను కూడా పక్కనబెట్టా. అవసరమైతే మీతో కలిసి టీ తాగుతా, భోజనం చేస్తానని చెప్పాగానీ పార్టీని త్యాగం చేయనని నా మిత్రులకు స్పష్టంగా చెప్పాను" అని చంద్రబాబు వివరించారు.
Chandrababu
TDP Workers
GD Nellore
Chittoor District

More Telugu News