SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 9వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

Rescue Operation continues for consecutive 9th day at SLBC Tunnel
  • ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం
  • టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో చిక్కుకుపోయిన 8 మంది
  • ఇవాళ నాలుగు మృతదేహాలు వెలికితీసే అవకాశం!
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది గల్లంతవడం తెలిసిందే. వారు బతికుండే అవకాశాలు పూర్తిగా అడుగంటిపోయాయి. మృతదేహాల వెలికితీతకు సహాయక చర్యలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, పోలీసులు, హైడ్రా టీమ్, సింగరేణి బృందం, పలు ప్రైవేటు కన్ స్ట్రక్షన్ కంపెనీల బృందాలు తవ్వకాలు ముమ్మరం చేశాయి. 

కాగా, ఇవాళ నాలుగు మృతదేహాలు వెలికితీసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిరంతరంగా నీటి ఊట వస్తుండడంతో తవ్వకాలకు అడ్డంకిగా మారుతోంది. పూడికను, కత్తిరించిన టన్నెల్ బోరింగ్ మెషీన్ భాగాలను బయటికి తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో సహాయక చర్యల్లో ఆశించిన వేగం కనిపించడంలేదు! 

కాగా, సహాయక బృందాలు షిఫ్టుకు 120 మంది చొప్పున 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో మొత్తం 18 ఏజెన్సీలు, 700 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
SLBC Tunnel
Rescue Operation
Telangana

More Telugu News