Borugadda Anil Kumar: బెయిలుపై బయటకు వచ్చి.. అజ్ఞాతంలోకి వెళ్లిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్

History sheeter Borugadda Anil Kumar Missing After Bail
  • తల్లికి అనారోగ్యమంటూ ఫేక్ సర్టిఫికెట్‌తో మధ్యంతర బెయిలు
  • అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన బోరుగడ్డ
  • ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
  • హైదరాబాద్‌లో ఆయన ఫోన్ సిగ్నల్స్ గుర్తింపు
  • విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు
తల్లి అనారోగ్యంతో బాధపడుతోందంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో మధ్యంతర  బెయిలు పొందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గుంటూరు రాజేంద్రనగర్‌, వేళాంగిణి నగర్‌లో ఆయన ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు దర్శనమిచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడం, ఫోన్లు స్విచ్చాఫ్ వస్తుండటంతో వారి ఆచూకీ కోసం పోలీసు గాలిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన బోరుగడ్డ రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదంటూ ఫిబ్రవరి 15న మధ్యంతర బెయిలు పొందాడు. 28న జైలులో లొంగిపోయాడు. అయితే, ఆ తర్వాత మరోమారు మధ్యంతర బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 

తన తల్లికి సీరియస్‌గా ఉందని మధ్యంతర బెయిలును పొడిగించాలని పేర్కొంటూ గుంటూరులోని లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ జారీచేసినట్టుగా మెడికల్ సర్టిఫికెట్‌ను జతపరిచాడు. దీంతో మార్చి 11 వరకు మధ్యంతర బెయిలును పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే, న్యాయస్థానానికి బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదని, దానిని తాము ఇవ్వలేదని డాక్టర్ పీవీ రాఘవశర్మ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి బోరుగడ్డ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు, ఆయన చెన్నై వెళ్లినట్టు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో బెయిలు పొంది ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత సెల్‌ఫోన్ వినియోగించినట్టు కాల్ డేటా ద్వారా గుర్తించారు. చివరిసారి ఆయన ఫోన్ సిగ్నల్‌ను హైదరాబాద్‌లో గుర్తించారు. కాగా, అతడు విదేశాలకు పారిపోకుండా గుంటూరు పోలీసులు గతంలోనే లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు.
Borugadda Anil Kumar
YSRCP
Andhra Pradesh

More Telugu News