Telangana: సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మికుల లేఖ

RTC workers letter to PM Modi and CM Revanth Reddy
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోకాయుక్త, సెంట్రల్ విజిలెన్స్‌కు లేఖ
  • 9 పేజీల లేఖ రాసిన 400 మంది ఆర్టీసీ కార్మికులు
  • చిన్న చిన్న పొరపాట్లకు తమను తొలగించారని ఆగ్రహం
  • పెద్ద పెద్ద స్కాంలు చేశారంటూ సజ్జనార్‌పై ఆరోపణలు
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులకు 400 మంది ఆర్టీసీ కార్మికులు (సస్పెన్షన్‌కు గురైన) లేఖ రాశారు. ఈ లేఖలో సజ్జనార్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు.

సజ్జనార్ అనైతిక, అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రధాని, ముఖ్యమంత్రితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోకాయుక్త, సెంట్రల్ విజిలెన్స్‌కు ఆర్టీసీ కార్మికులు 9 పేజీల లేఖను రాశారు.

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు కార్మికులు మాట్లాడారు. సజ్జనార్ చేసిన అనైతిక పనులతో పాటు అవినీతికి సంబంధించి ఈ తొమ్మిది పేజీల లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.

చిన్న చిన్న పొరపాట్లకు తమను ఉద్యోగం నుండి తొలగించడం ద్వారా తమ కుటుంబాలను రోడ్డున పడేశారని సజ్జనార్‌పై కొంతమంది కార్మికులు ఆరోపణలు చేశారు.

సజ్జనార్ మాత్రం పెద్ద పెద్ద స్కాంలు చేస్తూ ప్రశాంతంగా ఉన్నారని హన్మకొండ డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ కంటతడి పెడుతూ ఆరోపణలు చేశారు. సజ్జనార్ గారు, మా వంటి చిన్న చిన్న ఉద్యోగులపై పగబట్టవద్దని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించవద్దని వ్యాఖ్యానించారు. తాము ప్రజల మధ్య ఉన్నప్పుడు చిన్నచిన్న పొరపాట్లు జరుగుతుంటాయని, వాటిని సరిదిద్దే స్థానంలో సజ్జనార్ ఉన్నారని ఆమె అన్నారు.
Telangana
RTC
Sajjanar

More Telugu News