QS World Rankings: క్యూఎస్ ర్యాంకింగ్స్ వివరాలు.. భారత్ నుంచి ఐఐటీ ఢిల్లీకి ఉత్తమ ర్యాంక్

iit delhi and iit bombay among top 50 in qs world rankings
  • టాప్ 50 వర్శిటీల జాబితాలో ఐఐటీ ఢిల్లీ (47), ఐఐటీ బాంబే (50)లకు చోటు
  • మరోసారి మొదటి స్థానంలో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) 
  • రెండు, మూడు స్థానాలలో నిలిచిన స్టాన్‌ఫోర్డ్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా 
ప్రపంచంలో ఉన్న యూనివర్శిటీలకు సంబంధించి క్యూఎస్ ర్యాంకులు 2025 విడుదల అయ్యాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే టాప్ 50 జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. అయితే ఈసారి ఐఐటీ ఢిల్లీ 47వ ర్యాంక్‌లో నిలవగా, ఐఐటీ బాంబే 50వ స్థానంలో ఉంది. గత ఏడాది ఐఐటీ ఢిల్లీకి 45వ స్థానం రాగా, ఈసారి 47కి చేరింది. 
 
ప్రపంచంలోని మొత్తం 550 యూనివర్శిటీలకు సంబంధించి క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితా విడుదల కాగా, మరోసారి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అంతర్జాతీయ స్థాయిలో మొదటి స్థానం సంపాదించింది. ఇక స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ రెండో స్థానంలో, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా మూడో స్థానంలో నిలిచాయి. మొదటి మూడు ర్యాంకులు కూడా అమెరికాలో ఉన్న వర్శిటీలే దక్కించుకోవడం విశేషం. 
 
ఇక క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాలో భారత్‌కు చెందిన పలు యూనివర్శిటీలను చూస్తే ..ఐఐటీ ఢిల్లీకి 47వ స్థానం వచ్చింది. అలాగే ఐఐటీ బాంబే 50, ఐఐటీ ఖరగ్‌పూర్ 78, ఐఐటీ మద్రాస్ 84, ఐఐటీ కాన్పూర్ 92, ఐఐఎస్‌టీ – బెంగళూరు 146 వ స్థానాల్లో నిలిచాయి. అలానే, 151 నుంచి 200 మధ్య ర్యాంకుల్లో అన్నా యూనివర్శిటీ – చెన్నై, ఐఐటీ గువాహటి, ఐఐటీ రూర్కీ, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచాయి. 

ఇక బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్) పిలానీ 251 – 300 మధ్య ర్యాంకుల్లో నిలిచింది. 301 నుంచి 350 మధ్య ర్యాంకుల్లో చెన్నైలోని ఎస్ఎంఆర్ యూనివర్శిటీ చోటు సంపాదించుకుంది. ఇక 401 నుంచి 450 ర్యాంకుల్లో చండీగఢ్ యూనివర్శిటీకి చోటు దక్కింది. 
QS World Rankings
IIT Delhi
IIT Bombay

More Telugu News