V Srinivas Goud: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud fires at Revanth Reddy for comments on KCR
  • స్ట్రెచర్ మీదకు వెళ్లారు.. తర్వాత మార్చురీకే వెళతారని రేవంత్ రెడ్డి వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలు అత్యంత హేయమన్న శ్రీనివాస్ గౌడ్
  • స్పీకర్‌ను జగదీశ్ రెడ్డి అవమానించలేదని వ్యాఖ్య
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "మాకు స్టేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకు వెళ్లారు, తర్వాత వెళ్లేది మార్చురీకే" అని కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ, రేవంత్ రెడ్డి చేసిన మార్చురీ వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తండ్రి వంటి కేసీఆర్ మరణం కోరుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీ ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో సభ కౌరవ సభను తలపిస్తోందని అన్నారు.

సభాపతిని తమ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అవమానించలేదని తెలిపారు. చట్టసభలు, స్పీకర్ అంటే తమ పార్టీకి గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. దళితులు అంటే గౌరవం ఉండటం వల్లే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టామని తెలిపారు. సభాపతిని జగదీశ్ రెడ్డి వ్యక్తిగతంగా అన్నట్టు వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
V Srinivas Goud
Telangana
BRS
Congress

More Telugu News