G. Kishan Reddy: తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు: కిషన్ రెడ్డి

Kishan Reddy talks about Language row and delimitation
  • త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి
  • హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన
  • పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్ రెడ్డి
తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలోకి డబ్ చేసి నిర్మాతలు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. త్రిభాషా విధానం దేశంలో కొత్తదేమీ కాదని ఆయన గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దుతోందని అబద్దపు ప్రచారం చేస్తున్నారని, ఎవరి పైనా హిందీని రుద్దే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు. ఏ భాష కావాలంటే ఆ భాషలో చదువుకునే అవకాశం ఉందని తెలిపారు. భాష పేరుతో దేశాన్ని విభజించడం సరికాదని ఆయన అన్నారు.

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రిగా ఏం చేశాడో చెప్పి స్టాలిన్ తమిళ ప్రజలను ఓట్లు అడగాలని సూచించారు. తమిళనాడులో ఆయన ఏమీ చేయలేదని, అందుకే భాష, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయనేది వట్టి మాటేనని అన్నారు.

కిషన్ రెడ్డి రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి కిషన్ రెడ్డి ​నేడు బేగంపేట రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని అన్నారు.

రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో మరో పది శాతం పనులు పూర్తి కావాల్సి ఉందని, త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ. 26.55 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నట్లు తెలిపారు. మరో రూ. 12 కోట్ల నిధులతో రెండో విడత పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.

ప్రయాణికులకు ఇబ్బందిలేకుండా దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్‌కు రావాల్సి వస్తే ముక్కు మూసుకొని వచ్చేవారమని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రైల్వే స్టేషన్ పేరుతో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో అందరూ మహిళలే ఉండేలా చూస్తామని కేంద్ర మంత్రి అన్నారు.


G. Kishan Reddy
Telangana
BJP

More Telugu News