Chandrababu Naidu: బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగింది: సీఎం చంద్రబాబు

Chandrababu Meeting with Bill Gates Focuses on AP Development
  • ఢిల్లీలో చంద్రబాబు పర్యటన
  • నేడు బిల్ గేట్స్ తో సమావేశం
  • ఏపీ అభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావొచ్చనే అంశంపై ఫలప్రదమైన చర్చ జరిగిందని తెలిపారు. 

ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలను మెరుగుపర్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగానికి ఉన్న అవకాశాలను చర్చించామని చంద్రబాబు వివరించారు. 

స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 విజన్ ను సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని... ఈ లక్ష్యాన్ని సాధించడంలో, ఏపీ ప్రజల సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం తమ సమయం, ఆలోచనలు, మద్దతు ఇస్తున్నందుకు బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu Naidu
Bill Gates
Gates Foundation
Andhra Pradesh
AP Development
Artificial Intelligence
Predictive Analytics
Swarnandhra Pradesh 2047
Technology
Healthcare

More Telugu News