Pawan Kalyan: ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే అందుకు కారణం ఇద్దరు వ్యక్తులు: పవన్ కల్యాణ్

Pawan Kalyan hails Chandrababu Naidu and Manda Krishna Madiga for SC Categorization
  • ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ
  • ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు, మంద కృష్ణ ఎంతో కృషి చేశారన్న పవన్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఇవాళ ఈ స్థాయి వరకు వచ్చిందంటే అందుకు ఇద్దరు వ్యక్తులు కారణమని... వారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అని కొనియాడారు. మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ఉద్యమాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని వివరించారు. 

గతంలో  ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని, గుర్తింపు లేని కులాలపైనా విస్తృతంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. తాను కూడా ఈ విషయంలో ఎంతో ఆసక్తి చూపించానని, ఉన్నతంగా ఆలోచించే దళిత మేధావులను కలిశానని తెలిపారు. 

తమ పేర్లకు చివర కులాల పేర్లను పెట్టుకోవడం అగ్రవర్ణాల్లోనే చూస్తుంటామని, కానీ మంద కృష్ణ తన పేరు చివరన కులం పేరును పెట్టుకోవడం సాహసోపేతం అని అభివర్ణించారు. ఇక, ఏపీలో మాల కులస్తులు ఎక్కువగా ఉంటారని, తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉంటారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా కులాల జనాభాలో తేడాలు ఉన్నాయని తెలిపారు. 

ఇలా ఒక్కో చోట ఒక్కో కులం ఆధిక్యంలో ఉందని, ఈ నేపథ్యంలో వర్గీకరణ చేయడం అనేది ఎంతో సమతుల్యంతో చేయాల్సిన పని అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణ బిల్లును జనసేన తరఫున మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.
Pawan Kalyan
SC Categorization
Manda Krishna Madiga
Chandrababu Naidu
Andhra Pradesh Assembly
Janasena
SC Reservation Bill
Dalit Leaders
Social Justice

More Telugu News