Lokesh: ఐటీ, అడ్వాన్స్డ్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి సిస్కోతో ఒప్పందం: మంత్రి లోకేశ్‌

Andhra Pradesh Govt Partners with Cisco for IT Skills Development
  • మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో సిస్కో-ఏపీఎస్ఎస్ డీసీ ఎంఓయూ
  • ఈ ఒప్పందం ద్వారా 50వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ 
  • విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాలలో కోర్సులు
రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య (డిగ్రీ, ఇంజనీరింగ్), వృత్తివిద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సిస్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్‌ను అందిస్తుంది. 

అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఏ కోర్సుల్లో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యతల ఆధారంగా కోర్సుల జాబితాను ఖరారు చేస్తారు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. ఈ ఒప్పందం ద్వారా 50వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, ఉపాధిని పెంపొందించడమే ఈ సహకారం లక్ష్యం.
 
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్య సామర్థ్యాన్ని పెంపొందించేలా సిస్కో వర్చువల్ విధానంలో NetAcad పోర్టల్‌ ద్వారా స్వీయ-అభ్యసన, బోధకుల నేతృత్వంలో ఇండస్ట్రీ ఎక్సోపోజర్ ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. విద్యార్థులకు ఆయా సంస్థల డిమాండ్ ఆధారిత కోర్సుల్లో శిక్షణా కార్యక్రమాలను డిజైన్ చేస్తారు. మారుతున్న సాంకేతికలకు అనుగుణంగా ముందస్తు అవసరాలకు సరిపడా సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. 

స్వీయ-అభ్యసన (సెల్ఫ్ లెర్నింగ్) కోర్సుల్లో అవగాహన పెంచడం, విద్యార్థులను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశం. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవసరాలకు అనుగుణంగా లెర్నర్ పార్టిసిపేషన్, కాంపిటీషన్స్, ఫ్యాకల్టీ ట్రైనింగ్, వర్క్స్ షాప్స్ నిర్వహణ వంటివి ఏపీఎస్ఎస్ డీసీ చేపడుతుంది. ఆయా కోర్సుల్లో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులు, ఉద్యోగులకు సిస్కో సర్టిఫికెట్లను జారీచేస్తుంది. ఏపీఎస్ఎస్ డీసీ ద్వారా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ లను అందిస్తారు. ఐటీ కెరీర్ లో యువతులకు మద్దతు నిచ్చే ఉమెన్ రాక్ ఐటీ (డ‌బ్ల్యూఆర్ఐటీ), అధునాతన టెక్నాలజీలో యువత, విద్యార్థులకు మద్ధతునిచ్చే ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫీచ‌ర్‌(ఎఫ్‌వైఐఎఫ్‌) వంటి ప్రోగ్రామ్ లను సిస్కో సీఎస్ఆర్ నిధుల ద్వారా అందిస్తుంది. 

ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ, సీఈవో జి.గణేష్ కుమార్, ఏపీఎస్ఎస్ డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, సిస్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్  దేడ్రిచ్, గవర్నమెంట్ అఫైర్స్ డైరెక్టర్ హరీశ్‌ కృష్ణన్, సేల్స్ బిజినెస్ డెవలప్ మెంట్ డైరెక్టర్ కె. వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Lokesh
Cisco
AP Skill Development Corporation
IT Skills Development
Digital Skills
Cybersecurity
AI
Networking
Andhra Pradesh
NetAcad
Self-learning
Virtual Internships
Skill Gap

More Telugu News