Vidala Rajani: విడదల రజనికి ఏపీ హైకోర్టులో చుక్కెదురు

AP High Court Adjourns Vidala Rajanis Anticipatory Bail Plea
  • విడదల రజనిపై అవినీతి ఆరోపణలు
  • రూ.2.2 కోట్లు వసూలు చేశారంటూ ఏసీబీ కేసు
  • ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో రజని పిటిషన్
  • మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం నాడు విచారణను వాయిదా వేసింది. అవినీతి ఆరోపణల కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆదేశించి, తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది.

వివరాల్లోకి వెళితే, మాజీ మంత్రి విడదల రజని, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరో ఇద్దరిపై ఏసీబీ ఈ వారం ప్రారంభంలో అవినీతి కేసు నమోదు చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పల్నాడు జిల్లాలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి రూ. 2.2 కోట్లు వసూలు చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

అయితే మాజీ మంత్రి రజని ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీని వీడిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు వ్యక్తిగత కక్షతోనే తనపై కేసు సృష్టించారని ఆమె ఆరోపించారు.

ఈ కేసులో రజనిని ప్రధాన నిందితురాలిగా పేర్కొనగా, ఆ తర్వాత ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి (ఆర్వీఈవో)గా పనిచేసిన పల్లె జాషువా, రజని మరిది విడదల గోపి, ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు. వీరంతా అధికారాన్ని దుర్వినియోగం చేసి, నేరపూరిత చర్యలకు పాల్పడి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు.

స్టోన్ క్రషింగ్ కంపెనీ మేనేజింగ్ పార్టనర్ నల్లపనేని చలపతిరావు ఫిర్యాదు మేరకు... రజని ఇతర నిందితులతో కుమ్మక్కై రూ. 2 కోట్లు లంచం వసూలు చేశారని, జాషువా, గోపి ఒక్కొక్కరు మరో రూ. 10 లక్షలు చొప్పున  వసూలు చేశారని ఆరోపించారు. తమ కంపెనీ కార్యకలాపాలను కొనసాగించాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని రజని, జాషువా మొదట్లో డిమాండ్ చేశారని చలపతిరావు ఆరోపించారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విచారణ జరిపి, 2024 డిసెంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 7A, IPCలోని సెక్షన్లు 384, 120B కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Vidala Rajani
Andhra Pradesh High Court
Anti-Corruption Bureau
ACB
Bail Petition
Corruption Case
Palle Jashuva
Lavu Sri Krishna Devarayalu
YSRCP
TDP

More Telugu News