Sri Dhar Babu: హెచ్‌సీయూ భూ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

400 Acres HCU Land Dispute Minister clarifies Govts Stand
  • హెచ్‌సీయూకు చెందిన అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదని వెల్లడి
  • కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • జీవ వైవిధ్యాన్ని కాపాడతామన్న మంత్రి శ్రీధర్ బాబు
కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూ) సంబంధించిన ఆస్తిని, ఒక అంగుళం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలతో కలిసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశ్వవిద్యాలయానికి చెందిన భూమి దానికే చెందుతుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు అడ్డు తగిలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారం రోజుల క్రితం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌తో ప్రభుత్వపరంగా సంప్రదింపులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. భూములకు సంబంధించి వారికి స్పష్టంగా చెప్పామని, ఏళ్లుగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించాలని తాము భావిస్తున్నామని తెలిపారు.

గత రెండు రోజుల నుంచి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాంతంలోని రాక్ ఫార్మేషన్స్, లేక్‌లు, ప్రసిద్ధి గాంచిన మష్రూమ్ రాక్స్, పికాక్ లేక్‌ను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు.
Sri Dhar Babu
HCU Land Dispute
Hyderabad Central University
400 Acres Land
Gachibowli Land Issue
Telangana Minister
HCU Controversy
Mushroom Rocks
Peacock Lake
Telangana Politics

More Telugu News