Harsh Kumar: పాస్ట‌ర్ ప్ర‌వీణ్ అనుమానాస్ప‌ద మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు

Pastor Praveens Suspicious Death Case Filed Against Former MP Harsh Kumar
  • పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల గ‌త నెల‌లో రోడ్డు ప్ర‌మాదంలో మృతి
  • ఆయ‌న మృతిపై అనుమానం వ్య‌క్తం చేసిన క్రిస్టియ‌న్ సంఘాలు
  • ఈ వ్య‌వ‌హారంపై  స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని పోలీసుల‌కు సీఎం చంద్ర‌బాబు ఆదేశం
  • అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ పోలీసులు  
  • ఈ క్ర‌మంలో పాస్ట‌ర్ మృతిపై మాజీ ఎంపీ హ‌ర్ష కుమార్‌ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల గ‌త నెల‌లో రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. అయితే, క్రిస్టియ‌న్ సంఘాలు ఆయ‌న మృతిపై అనుమానం వ్య‌క్తం చేశాయి. ఎవ‌రో ప్ర‌వీణ్‌ను చంపేసి ఉంటార‌ని, నిందితుల‌ను పోలీసులు ప‌ట్టుకోవాల‌ని డిమాండ్ చేశాయి. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన సీఎం చంద్ర‌బాబు స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి, నిజ‌నిజాలు తేల్చాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

ఈ క్ర‌మంలో మాజీ ఎంపీ హ‌ర్ష కుమార్... పాస్ట‌ర్ ప్ర‌వీణ్ మృతిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న‌ను ఎక్క‌డో చంపేసి, రోడ్డు ప‌క్క‌న విసిరేయ‌డం ద్వారా రోడ్డు ప్ర‌మాదంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌న్నారు. పోలీసులు ఈ కేసును త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని, దీనికి సంబంధించి త‌న వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని తెలిపారు. 

మాజీ ఎంపీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన పోలీసులు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేశారు. పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల మృతిపై చేసిన ఆరోప‌ణ‌ల‌కు త‌గిన ఆధారాల‌తో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, హ‌ర్ష కుమార్ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. పైగా మ‌రోసారి అవే వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. 

దాంతో పోలీసులు ఇవాళ ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. పాస్ట‌ర్ మృతి కేసులో త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారంటూ మాజీ ఎంపీపై బీఎన్ఎస్ సెక్ష‌న్ 196, 197 కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఈ నేప‌థ్యంలో త‌న‌పై న‌మోదైన కేసుల‌పై హ‌ర్ష కుమార్ స్పందిస్తూ, మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. 
Harsh Kumar
Pastor Praveen Pagadala
AP Politics
Murder Case
Suspicious Death
Road Accident
YCP Leader
Former MP
Police Investigation
False Accusations

More Telugu News