Chandrababu Naidu: కేంద్రంతో చంద్రబాబు సఖ్యత... రాజ్‌దీప్ సర్దేశాయ్ కీలక విశ్లేషణ

Rajdeep Sardesai on Chandrababu Naidu and Nitish Kumars Political Strategies
  • మోదీ విమర్శకుల నుంచి మిత్రులుగా మారిన బాబు, నితీశ్.
  • రాజకీయ మనుగడ, అవసరాలే వైఖరి మార్పునకు కారణమన్న సర్దేశాయ్
  • ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంతో బాబు 'లావాదేవీల' బంధం
  • వ్యక్తిగత మనుగడకే నితీశ్ ప్రాధాన్యం
  • సిద్ధాంతాల స్థానంలో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారన్న సర్దేశాయ్
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల గతంలో తీవ్ర విమర్శనాత్మక వైఖరి అవలంబించిన ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లు ప్రస్తుతం ఆయనకు సన్నిహిత మిత్రులుగా మారారని, దీని వెనుక వారి రాజకీయ అవసరాలే ప్రధాన కారణమని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ విశ్లేషించారు. సమకాలీన రాజకీయాల్లో సిద్ధాంతాల కన్నా సౌలభ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారడమే కీలక పాత్ర పోషిస్తున్నాయనడానికి ఈ ఇద్దరు నేతల మార్పే నిదర్శనమని సర్దేశాయ్ తన 'స్ట్రెయిట్ బ్యాట్' వీడియో బ్లాగ్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబు, నితీశ్‌లు 'రాజకీయ జిమ్నాస్టిక్స్‌'లో ఒలింపిక్ పతకాలు సాధించగలరని సర్దేశాయ్ చమత్కరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత హంగ్ పార్లమెంట్ ఏర్పడితే చక్రం తిప్పవచ్చని భావించిన ఈ ఇద్దరు నేతలు, పది నెలలు గడిచేసరికి మోదీ, బీజేపీల ప్రాబల్యాన్ని మౌనంగా అంగీకరించారని ఆయన తెలిపారు. ఇటీవల పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ, జేడీయూ మద్దతు ఇవ్వడమే దీనికి తాజా ఉదాహరణ అని సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా చంద్రబాబు విషయంలో ఈ మార్పు మరింత గమనించదగ్గదని సర్దేశాయ్ అన్నారు. 2019 ఎన్నికల సమయంలో మోదీని తీవ్రస్థాయిలో విమర్శించిన (ఒక దశలో 'టెర్రరిస్ట్' అని కూడా అన్నారని సర్దేశాయ్ గుర్తుచేశారు) చంద్రబాబు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు కేంద్రంతో 'లావాదేవీల తరహా సంబంధాన్ని' నెరుపుతున్నారని ఆయన విశ్లేషించారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్, వాజ్‌పేయి ఎన్డీఏ ప్రభుత్వాలకు మద్దతిచ్చిన అనుభవం, తనకున్న పరిపాలనా దక్షతతో బీజేపీ మద్దతు లేకున్నా ఏపీలో నెగ్గుకురాగల సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నప్పటికీ, కేంద్రంతో సయోధ్యకే ఆయన ప్రాధాన్యమిస్తున్నారని సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు, నితీశ్ కుమార్ మార్పు వ్యక్తిగత రాజకీయ మనుగడ కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టడానికి నిలువెత్తు నిదర్శనమని సర్దేశాయ్ అభివర్ణించారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్డీఏ నుంచి వైదొలగిన నితీశ్, ప్రస్తుతం అదే కూటమిలో భాగస్వామిగా ఉన్నారని గుర్తుచేశారు. గతంలో మోదీతో వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టపడని ఆయన, ఇప్పుడు మోదీ ప్రాబల్యం ముందు ఒక సామంతరాజు వలె కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి కూడా ఆయన్ను బలహీనపరిచిందని, బీహార్ ఎన్నికల వరకు బీజేపీకి ఆయనొక 'మస్కట్' వలె ఉపయోగపడతారని సర్దేశాయ్ అన్నారు. 2013లో ఎన్డీఏను వీడినప్పుడు 'తాను నియంతతో పనిచేయలేనని' నితీశ్ తనతో అన్న మాటలను సర్దేశాయ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మొత్తంగా, చంద్రబాబు, నితీశ్ కుమార్ ఇద్దరూ రాజకీయ మనుగడ కోసం తమ విధానాల్లో అవసరమైన లౌక్యాన్ని ప్రదర్శిస్తూ, దాన్ని ఒక కళగా మార్చారని సర్దేశాయ్ విశ్లేషించారు. వీరి రాజకీయ నిర్ణయాలు లౌకికవాదం, మతతత్వాల మధ్య గీతను చెరిపేస్తున్నాయని, సిద్ధాంతాల స్థానంలో సౌలభ్యం, అవకాశవాదం ముందుకొస్తున్నాయని ఆయన అన్నారు. ఈ పరిణామం లౌకిక రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ నేతలు ఒకప్పుడు విశ్వసించిన ఆదర్శాలకు ఎంత దూరమయ్యారో 'పగిలిన లౌకికవాద అద్దం'లో చూసుకోవాలని సర్దేశాయ్ సూచించారు.

Chandrababu Naidu
Nitish Kumar
Rajdeep Sardesai
BJP
Modi
TDP
JDU
Indian Politics
Political Analysis
2024 Elections

More Telugu News