Sheikh Rashid: ఐపీఎల్ లో ఆరంగేట్రం చేసిన గుంటూరు కుర్రాడు... మంత్రి నారా లోకేశ్ స్పందన

AP Cricketer Sheikh Rashids IPL Debut Minister Nara Lokeshs Reaction
  • ఇవాళ లక్నోతో మ్యాచ్ లో సీఎస్కే తరఫున బరిలో దిగిన షేక్ రషీద్
  • ఐపీఎల్ లో రషీద్ కు ఇదే తొలి మ్యాచ్
  • శుభాభినందనలు తెలిపిన మంత్రి నారా లోకేశ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్, గుంటూరుకు చెందిన షేక్ రషీద్‌ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ అభినందించారు. రాష్ట్రానికి చెందిన ఒక యువ క్రీడాకారుడు దేశంలోని ప్రముఖ క్రికెట్ లీగ్‌లో భాగం కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించి, జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించిన షేక్ రషీద్, తన నిరంతర ప్రతిభ, కఠోర శ్రమతో ఈ స్థాయికి చేరుకున్నారని మంత్రి లోకేశ్ ప్రశంసించారు. గుంటూరు లాంటి ప్రాంతం నుంచి వచ్చి, ఎన్నో సవాళ్లను అధిగమించి, క్రికెట్‌లో అత్యున్నత వేదికపై అడుగుపెట్టడం ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.క్రికెట్ ప్రాక్టీస్ కోసం రోజూ 40 కిలోమీటర్లు ప్రయాణించే స్థాయి నుంచి అండర్-19 భారత జట్టు వైస్ కెప్టెన్ గా ఎదిగాడని కొనియాడారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ, "షేక్ రషీద్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడటం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అతని పట్టుదల, అంకితభావం నేటి యువతరానికి ఆదర్శం. రషీద్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని" ఆకాంక్షించారు.

షేక్ రషీద్ ఐపీఎల్ ప్రయాణం విజయవంతంగా సాగాలని, రాబోయే మ్యాచ్‌లలో తన ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, నేటి మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన షేక్ రషీద్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేసి అవుటయ్యాడు. 
Sheikh Rashid
IPL
Chennai Super Kings
Andhra Pradesh Cricketer
Nara Lokesh
Indian Premier League
Under-19 Indian Cricket Team
Guntur
AP Cricket
Youth Cricketer

More Telugu News