Sanjay Kumar Jagtial MLA: ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో ఎందుకు చేరారో తెలియడం లేదు.. డబ్బు కోసం వెళ్లినట్లు చెబుతున్నారు!: కవిత

Kavitha Accuses Jagtial MLA of Switching Parties for Money
  • ప్రజలకు ఏదైనా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారకపోయేవారన్న కవిత
  • ఎమ్మెల్యేల పనితీరుపై ర్యాంకులు ఇస్తే సంజయ్‌కి 108వ ర్యాంకు వచ్చిందన్న కవిత
  • ఓసారి ముఖ్యమంత్రి, మరోసారి ధర్మపురి అరవింద్‌తో కనిపిస్తున్నారని విమర్శ
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆశ్చర్యం కలిగించిందని, ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన డబ్బు కోసమే అధికార పార్టీ వైపు వెళ్లారని అందరూ అంటున్నారని ఆమె పేర్కొన్నారు.

ప్రజలకు ఏదైనా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఆయన పార్టీ మారాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యేల పనితీరుపై ర్యాంకులు ఇచ్చారని, 119 మంది ఎమ్మెల్యేల్లో సంజయ్‌కు 108వ ర్యాంకు వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే ఎంత గొప్పగా పని చేస్తున్నారో ఈ ర్యాంకును బట్టి తెలుస్తోందని అన్నారు.

అసెంబ్లీలో ఆయన ప్రజా సమస్యలపై ఎప్పుడు మాట్లాడలేదని, ఒక్కసారైనా నోరు విప్పింది లేదని విమర్శించారు. ఎమ్మెల్యే సంజయ్ ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కనిపిస్తారని, మరోసారి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి కనిపిస్తారని, ఆయన అయోమయంలో ఉన్నట్లుగా ఉందని అన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ జగిత్యాలకు రావాల్సిన పథకాలు, నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 27వ తేదీన జరగనున్న బీఆర్ఎస్ మహాసభ కుంభమేళా తరహాలో ఉంటుందని అన్నారు. ఈ సభకు లక్షలాది మంది తరలి వస్తారని, జగిత్యాల నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌ పుట్టి 25 ఏళ్లు కావడంతో ఈసారి సభకు ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ రజతోత్సవ వేడుకలు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి కావని, తెలంగాణ ప్రజల పండుగ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మనల్ని తెలుగోళ్లు అనేవారు తప్ప, తెలంగాణవాళ్లు అనే గుర్తింపు లేదని అన్నారు. తెలంగాణవాళ్లు అనే ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది కేసీఆర్ అని కవిత అన్నారు.
Sanjay Kumar Jagtial MLA
Kalvakuntla Kavitha
BRS Party
Congress Party
Telangana Politics
Party Hopping
Jagtial
Revanth Reddy
Dharmapuri Arvind
BRS Maha Sabha

More Telugu News