Chandrababu: రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి... 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన సీఎం చంద్ర‌బాబు

Chandrababu Naidu Seeks Support from 16th Finance Commission for APs Reconstruction
  • నేడు మీరు సాయం చేసి నిలబెడితే... రేపు దేశం సాధించే విజయాల్లో కీలకంగా ఉంటామ‌న్న సీఎం
  • రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించాల‌ని విజ్ఞ‌ప్తి
  • స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాల‌ని కోరిన చంద్ర‌బాబు
  • 16వ ఆర్థిక సంఘానికి స్వయంగా స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని... దృఢమైన నిర్ణయాలతో, ఉత్తమ పాలసీలతో పాలన సాగిస్తూ సమస్యలను అధిగమిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని లేకపోవడం వల్ల రెవెన్యూ జనరేషన్‌కు అనేక సమస్యలు ఉన్నాయని సీఎం వివరించారు. ఈ కారణంగానే ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు.

ఆర్ధిక సంఘానికి సాదర స్వాగతం..
రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఫైనాన్స్ కమిషన్‌కు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వీడియో రూపంలో ప్రదర్శించి వివరించారు. రాష్ట్ర విభజన ప్రభావం, ఆర్థిక సవాళ్లు, 2014 తరువాత వృద్ధిరేటులో రాష్ట్రం సాధించిన ప్రగతి, ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆర్థిక సంఘానికి సీఎం వివ‌ర‌ణ ఇచ్చారు. 

గత ప్రభుత్వంలో ఐదేళ్లూ తీవ్ర నష్టం..
2019 తరువాత నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రాష్ట్ర ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని సీఎం వివరించారు. గత 10 నెలల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ప్రజెంటేషన్ ద్వారా సీఎం వివరించారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం అందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో నెలకొన్న‌ ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా కేంద్రం కేటాయింపులు జరిపేలా సిఫార్సులు చేయాలని సీఎం విన్నవించారు.

పనగారియా సేవలు ఎంతో విలువైనవి..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... “16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన దేశానికి చేస్తున్న సేవలు ఎంతో విలువైనవి. పనగారియా నీతి ఆయోగ్‌లో పని చేసిన సమయంలోనే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించారు. దేశంలో ఉన్న ఇతర జాతీయ ప్రాజెక్టుల పురోగతి మందగించడంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని సిఫార్సు చేశారు. వచ్చే పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మీరు కూడా రావాలని కోరుతున్నాను” అని సిఎం అన్నారు.

మోదీ నాయకత్వంలో దేశ ముఖచిత్రం మారుతోంది..
“ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ వైపు ప్రయాణిస్తోంది. ఒకప్పుడు దేశ వృద్ధి రేటు చూసి ప్రపంచం హేళన చేసేది. కానీ నేడు ప్రపంచం గర్వించే స్థాయిలో భారత్ వృద్ధి సాధిస్తోంది. నేడు మనం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. 2028 నాటికి మూడవ స్థానానికి చేరుకుంటాం. 2047 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అభివృద్ది చెందుతాం. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తివంతంగా ఉంటున్నాయి. సంస్కరణలు దేశ ముఖచిత్రాన్ని మార్చే ఫలితాలను ఇస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో తెచ్చిన అనేక సంస్కరణలు అనేక మార్పులు తెచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐటీని ప్రోత్సహించాం. మంచి ఫలితాలు వచ్చాయి. నేడు ఏఐ గురించి మాట్లాడుతున్నాం. జనాభా విషయంలో కూడా మేం ఒక పాలసీ తీసుకున్నాం. జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు ఆలోచిస్తున్నాం. ఇది భారత దేశానికి కీలకమైన దశ. అమృత్ కాల్ అని చెప్పాలి. దేశం అతి గొప్ప విజయాలు సాధించేలా ఫైనాన్స్ కమిషన్ కీలక భూమిక పోషించాలి అని కోరుకుంటున్నా” అని ముఖ్య‌మంత్రి అన్నారు. 

నాలుగు సార్లు సీఎంగా చేసినా ఇన్ని సవాళ్లు చూడలేదు..
“నేను ప్రస్తుతం నాలుగో సారి సీఎంగా ఉన్నాను. కానీ ఇన్ని సవాళ్లు, ఇన్ని ఆర్థిక కష్టాలు ఎప్పుడూ చూడలేదు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకత్వానికి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అప్పుల కోసం గత ప్రభుత్వం తహసీల్దార్ ఆఫీస్ లు కూడా తాకట్టు పెట్టింది. 25 ఏళ్లకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టింది. ఇలాంటి సమస్యల నుంచి బయటకు వచ్చి రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాం. సంక్షేమ, అభివృద్ది బ్యాలెన్స్ చేసుకుంటూ సుపరిపాలన అందిస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ రోజు మేం నిలబడేందుకు, ముందుకు వెళ్లేందుకు మీరు సాయం చేస్తే...రేపు పుంజుకుని మాకున్న బలం ద్వారా అనూహ్య విజయాలు సాధిస్తాం. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వంతు పాత్ర పోషిస్తాం. తద్వారా దేశ నిర్మాణంలో ముఖ్యమైన రాష్ట్రంగా నిలుస్తాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు, ఉద్యోగ కల్పనకు అవసరమైన పెట్టుబడులు సాధించేందుకు మేం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. జాబ్ ఫస్ట్ అనే నినాదంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానంతో మేం పని చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.
Chandrababu
Andhra Pradesh
16th Finance Commission
Amaravati
Polavaram Project
Economic Growth
State Finances
Arvind Panagariya
Narendra Modi
Fiscal Reforms

More Telugu News