Akyniele Sava Taylor: విమానం హైజాక్ కు యత్నం.. హైజాకర్‌ను కాల్చి చంపిన ప్యాసింజర్

Passenger Shoots Down Hijacker in Belize Plane Incident
  • బెలిజ్‌లో ట్రోపిక్ ఎయిర్ విమానం హైజాక్ చేసేందుకు అమెరికన్ పౌరుడి యత్నం
  • కత్తితో పైలట్, ఇద్దరు ప్రయాణికులపై దాడి చేసిన హైజాకర్ టేలర్
  • టేలర్‌ను కాల్చి చంపిన తోటి ప్రయాణికుడు 
  • గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమం
బెలిజ్‌లో గురువారం తీవ్ర కలకలం రేగింది. ఓ చిన్న ప్యాసింజర్ విమానాన్ని హైజాక్ చేసేందుకు యత్నించిన అమెరికా జాతీయుడిని, తోటి ప్రయాణికుడు కాల్చి చంపాడు. ఈ ఘటనకు ముందు హైజాకర్ కత్తితో దాడి చేయడంతో పైలట్‌తో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. మెక్సికో సరిహద్దుకు సమీపంలోని కొరోజల్ పట్టణం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శాన్ పెడ్రోకు 14 మంది ప్రయాణికులతో ట్రోపిక్ ఎయిర్ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, ప్రయాణికుల్లో ఒకడైన 49 ఏళ్ల అకిన్యేల సావా టేలర్ అనే అమెరికా పౌరుడు తన వద్ద ఉన్న కత్తితో ఒక్కసారిగా కలకలం సృష్టించాడు. విమానాన్ని దేశం బయటకు మళ్లించాలని పైలట్‌ను డిమాండ్ చేశాడు. ఇంధనం నింపుకోవడానికి విమానాన్ని ల్యాండ్ చేయాలని కూడా ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో తనను అడ్డుకోబోయిన పైలట్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులను టేలర్ కత్తితో పొడిచాడు. దీంతో విమానంలో భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే, గాయపడిన ప్రయాణికుల్లో ఒకరి వద్ద లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది. విమానం ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో, ఆ ప్రయాణికుడు టేలర్‌పై కాల్పులు జరిపాడు. ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో టేలర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

హైజాకర్ దాడిలో గాయపడిన ముగ్గురూ బెలిజ్ జాతీయులే. వారికి ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరికి ఊపిరితిత్తులకు గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విమానం అప్పటికే ల్యాండింగ్ కోసం ఎయిర్‌స్ట్రిప్ చుట్టూ చక్కర్లు కొట్టడంతో ఇంధనం దాదాపు అయిపోయే స్థితికి చేరుకుంది. అయినప్పటికీ, పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు.
Akyniele Sava Taylor
Belize plane hijacking
Passenger shoots hijacker
Tropical Air
Belize Airport
Plane hijack attempt
Knife attack on plane
US citizen
Corazol
San Pedro

More Telugu News