Jos Buttler: గుజరాత్ రికార్డు ఛేజ్... బట్లర్ 97 నాటౌట్.. ఆఖర్లో తెవాటియా మెరుపులు

Gujarat Titans Record Chase Buttlers 97 Tewatias Blitz Secures Thrilling Win
  • ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపు
  • భారీ లక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ (97*) అజేయ ఇన్నింగ్స్
  • మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్: 203/8 (20 ఓవర్లు)
  • గుజరాత్ బౌలర్ ప్రసిధ్ కృష్ణకు 4 వికెట్లు.
  • గుజరాత్ టైటాన్స్ చరిత్రలో ఇదే హయ్యస్ట్ ఛేజింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) అద్భుత విజయాన్ని అందుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో జరిగిన 35వ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన జోస్ బట్లర్ (54 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా... మిచెల్ స్టార్క్ విసిరిన ఆ ఓవర్లో తెవాటియా వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి గుజరాత్ కు చిరస్మరణీయ గెలుపును అందించాడు. గత మ్యాచ్ లో ఇలాంటి పరిస్థితుల్లోనే బౌలింగ్ చేసిన స్టార్క్ సూపర్ ఓవర్ లో జట్టు విజయానికి కారకుడయ్యాడు. అయితే ఇవాళ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. తెవాటియా అతడికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ లో 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి. గతంలో ఆ జట్టు సక్సెస్ ఫుల్ లక్ష్యఛేదన 198 పరుగులు.

ఛేదనలో తడబడినా... బట్లర్ నిలబెట్టాడు

204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (7) త్వరగా రనౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని మెరుపు షాట్లతో స్కోరు బోర్డును నడిపించాడు. సుదర్శన్ ఔటయ్యాక, క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు. అతనికి షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (34 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నుంచి అద్భుతమైన సహకారం లభించింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 

రూథర్‌ఫోర్డ్ ఔటైన తర్వాత, రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 11*; 1 ఫోర్, 1 సిక్స్) తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు. గుజరాత్ జట్టు 19.2 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

ఢిల్లీ భారీ స్కోరు... ప్రసిద్ధ్ కృష్ణ మాయ

అంతకుముందు, టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్ (32 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్‌లు), చివర్లో మెరుపులు మెరిపించిన అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. వీరితో పాటు ట్రిస్టన్ స్టబ్స్ (31), కరుణ్ నాయర్ (31), కేఎల్ రాహుల్ (28) కూడా రాణించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేయగలిగింది. 

గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ జోరుకు కొంత కళ్లెం వేశాడు. మహమ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ఇషాంత్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.
Jos Buttler
Rahul Tewatia
Gujarat Titans
Delhi Capitals
IPL 2025
Cricket Match
Ahmedabad
Narendra Modi Stadium
Thrilling Victory
Record Chase

More Telugu News