P.S.R. Seetharama Anjaneyulu: ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు అరెస్ట్‌పై కాదంబరి జత్వానీ న్యాయవాది స్పందన

Kadambari Jethwanis Lawyer Responds on PSR Anjaneyulu Arrest
  • మాజీ ఇంటెలిజెన్స్ చీప్ పి.సీతారామాంజనేయులు అరెస్ట్
  • ఈ మొత్తం వ్యవహారంలో సీతారామాంజనేయులు పాత్ర ఉందన్న జత్వానీ న్యాయవాది
  • బాధితులకు న్యాయం జరగాలని ఆకాంక్ష
ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు నమోదు చేసి, అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి. సీతారామాంజనేయులును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ అరెస్ట్‌పై జత్వానీ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ముంబైలో ఓ పారిశ్రామికవేత్తపై (సజ్జన్ జిందాల్) నటి జత్వానీ పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకే, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెపై, ఆమె కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు బనాయించారని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే కొందరు అధికారులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్ట్ చేశారని తెలిపారు. బాధితులను 50 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధించారని, వారి ఆస్తులను అటాచ్ చేసి, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారని, పాస్‌పోర్టులు సీజ్ చేసి, విదేశాల్లో ఉన్న సోదరుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని వివరించారు.

ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి అడిషనల్ ఎస్పీ విశాల్ గున్నిని సీతారామాంజనేయులు ఆదేశించారని, తన విశాఖపట్నం బదిలీ నిలుపుదల కోసం ఈ పని పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చారని గున్నినే స్వయంగా విచారణలో వెల్లడించినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఈ కుట్రకు సంబంధించిన చర్చలు జరిగాయని గున్ని చెప్పినట్లు తెలిపారు. ఐపీఎస్ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపై సమగ్ర విచారణ జరిపి, అసలు సూత్రధారులను బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఐపీఎస్ అధికారులకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆయన కోరారు. సీతారామాంజనేయులు అరెస్ట్‌తోనైనా బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు శిక్ష పడాలని శ్రీనివాస్ ఆకాంక్షించారు.
P.S.R. Seetharama Anjaneyulu
Kadambari Jethwani
CID Arrest
Andhra Pradesh
False Case
Illegal Detention
Visakhapatnam Transfer
Narra Srinivas
IPS Officer
Sajjan Jindal

More Telugu News