Kashmir Terrorist Attack: భర్తను కాల్చి చంపిన ఉగ్రవాదికి ఎదురెళ్లిన మహిళ

Wife Confronts Terrorist After Husbands Murder in Kashmir
  • తననూ, తన కొడుకునూ చంపేయాలని ఆవేదన
  • ‘మిమ్మల్ని చంపబోం.. వెళ్లి మోదీకి చెప్పండి’ అంటూ వెళ్లిపోయిన ఉగ్రవాది
  • భర్త మృతదేహంతోనే ఇంటికి తిరిగి వెళతానని తేల్చిచెప్పిన మహిళ
జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో కళ్లముందే భర్తను కోల్పోయిన పల్లవి అనే మహిళ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుమారుడితో కలిసి ఉగ్రవాదికి ఎదురెళ్లి తమను కూడా చంపేయాలని నిలదీశారు. అయితే, మిమ్మల్ని చంపబోం, మీరు వెళ్లి మోదీకి ఈ విషయం చెప్పండంటూ ఉగ్రవాది అక్కడి నుంచి వెళ్లిపోయాడని బాధితురాలు చెప్పారు. తన కళ్లెదుటే జరిగిన ఘోరాన్ని తలుచుకుంటూ కన్నీటిపర్యంతమైన బాధితురాలు.. జరిగిన దారుణాన్ని, ఉగ్రవాది తమతో చెప్పిన మాటలను మీడియాకు వివరించారు.

శివమొగ్గ నుంచి భర్త మంజునాథ్, 18 ఏళ్ల కుమారుడు అభిజేయతో కలిసి తాము కశ్మీర్ పర్యటనకు వచ్చామని పల్లవి తెలిపారు. ఉదయం నుంచి అభిజేయ ఏమీ తినకపోవడంతో తన భర్త అతడి కోసం రొట్టె తీసుకురావడానికి వెళ్లారని చెప్పారు. ఆ సమయంలో కాల్పుల శబ్దం వినిపించిందని, మొదట ఆర్మీ కాల్పులేమో అనుకున్నామని చెప్పారు. వెంటనే ప్రజలు పరుగులు తీయడం చూశామని, తన భర్త అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్నారని, తలలో బుల్లెట్ గాయమైందని చెప్పారు. "నా కళ్ల ముందే నా భర్తను కాల్చి చంపారు. ఏం జరిగిందో అర్థం కాలేదు, కనీసం ఏడవలేకపోయాను" అని పల్లవి ఆవేదన వ్యక్తం చేశారు.

దాడి తర్వాత తాను, తన కుమారుడు ఓ ఉగ్రవాదిని ఎదుర్కొన్నామని పల్లవి తెలిపారు. "నా భర్తను చంపావు కదా, నన్ను కూడా చంపు" అని తాను అన్నానని, "కుక్కా, మా నాన్నను చంపావు, మమ్మల్ని కూడా చంపెయ్" అని తన కుమారుడు కూడా ఉగ్రవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశాడని ఆమె చెప్పారు. అయితే, ఆ ఉగ్రవాది "మిమ్మల్ని చంపను. వెళ్లి మోదీకి చెప్పండి" అని తమతో అన్నట్లు పల్లవి వెల్లడించారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నారని, వారు ఆర్మీ దుస్తుల్లో లేరని ఆమె పేర్కొన్నారు. హిందువులను, అందులోనూ మగవారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని ఆమె వివరించారు. తన భర్త మృతదేహాన్ని స్వస్థలం శివమొగ్గకు తరలించాలని, ముగ్గురం కలిసే తిరిగి వెళ్తామని, ఒంటరిగా మాత్రం రానని పల్లవి ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు.
Kashmir Terrorist Attack
Pahalgham Attack
Pallavi
Pulwama Attack
Terrorism in Kashmir
India Terrorism
Manjunath
Abhijay
Shivamogga
Modi

More Telugu News