Bharat Bhushan: 'ప్లీజ్ నన్ను చంపొద్దు' అని వేడుకున్నా నా భర్తను కళ్లెదుటే కాల్చివేశారు: భయానక ఘటనను వివరించిన భరత్ భూషణ్ భార్య

Horrific Kashmir Attack Witness Recounts Brutal Killing of Husband
  • పహల్గాం సమీప బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి
  • మంగళవారం మధ్యాహ్నం సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు
  • ఘటనలో భరత్ భూషణ్ సహా 26 మంది పర్యాటకులు మృతి
  • మూడేళ్ల కుమారుడు ఉన్నాడని వేడుకున్నా భర్తను చంపారని భార్య సుజాత ఆవేదన
  • ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ హెచ్చరిక
జమ్ముకశ్మీర్‌లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. బైసరన్ లోయ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహితం కాల్పుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో భరత్ భూషణ్ అనే వ్యక్తి ఉన్నారు. తన మూడేళ్ల కుమారుడిని చూపి కనికరించమని వేడుకున్నా ఉగ్రవాదులు కనికరం చూపకపోవడం అందరినీ కలచివేస్తోంది.

సైనిక దుస్తులు ధరించిన కొందరు ఉగ్రవాదులు బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులను చుట్టుముట్టారు. అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు. ఈ ఊహించని పరిణామంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. దాడి జరిగిన సమయంలో భరత్ భూషణ్ తన భార్య సుజాత, మూడేళ్ల కుమారుడితో కలిసి అక్కడ ఉన్నారు.

ఈ దాడిని కళ్లారా చూసి, భర్తను కోల్పోయిన సుజాత ఆనాటి భయానక క్షణాలను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. "ఏప్రిల్ 18న మేము విహారయాత్రకు బయలుదేరాం. మా ప్రయాణంలో పహల్గామ్ చివరి మజిలీ. గుర్రాలపై బైసరన్ వెళ్లాం. అక్కడ కశ్మీరీ దుస్తులు ధరించి ఫోటోలు దిగుతూ, మా బాబుతో ఆడుకుంటున్నాం. ఇంతలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. మొదట అడవి జంతువులను తరిమేందుకు శబ్దాలు చేస్తున్నారేమో అనుకున్నాం. కానీ ఆ శబ్దాలు క్రమంగా మాకు సమీపించడంతో అది ఉగ్రదాడి అని అర్థమైంది" అని ఆమె తెలిపారు.

"బైసరన్ విశాలమైన మైదానం కావడంతో దాక్కునేందుకు స్థలం దొరకలేదు. మేం సరిగ్గా మధ్యలో ఉన్నాం. దగ్గర్లోని కొన్ని టెంట్ల వెనుక నక్కినా, ఏం జరుగుతుందో మాకు కనిపిస్తూనే ఉంది. ఉగ్రవాదులు ఒక్కొక్కరినీ బయటకు లాగి, వివరాలు అడిగి కాల్చి చంపడం చూశాం. మా కళ్ల ముందే ఒక వ్యక్తి తలపై రెండుసార్లు కాల్చారు. 'మా పిల్లలు బాధపడుతుంటే మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?' అని ఓ ఉగ్రవాది అనడం నా చెవిన పడింది" అని సుజాత వివరించారు.

"అంతలోనే ఒక ఉగ్రవాది నా భర్త వద్దకు వచ్చాడు. 'నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు, దయచేసి వదిలేయండి' అని నా భర్త ఎంతగానో ప్రాధేయపడ్డాడు. కానీ ఆ ఉగ్రవాది ఏమీ అడగకుండానే, కనికరం చూపకుండా నా కళ్లెదుటే కాల్చి చంపాడు" అని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
Bharat Bhushan
Sujata
Jammu and Kashmir
Pahalgham
Baisaran Valley
Terrorist Attack
Kashmir Terrorism
India Terrorism
Tourist Killing
Wife's Account

More Telugu News