Seema Haider: పాక్ పౌరులు తమ దేశం వెళ్లిపోవాలన్న కేంద్రం.. సీమా హైదర్ వెళ్లిపోవాల్సిందేనా?

Seema Haiders Lawyer Fights for her Indian Citizenship Amidst Deportation Orders
  • సీమా హైదర్ పాకిస్థానీ కాదంటూ ఆమె లాయర్ వాదన
  • భారతీయుడిని వివాహం చేసుకుందని, ఓ బిడ్డకు జన్మనిచ్చిందని గుర్తుచేసిన లాయర్
  • కేంద్రం ఆదేశాల నుంచి ఆమెకు మినహాయింపు వర్తిస్తుందని వ్యాఖ్య
  • రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడి 
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులను బహిష్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులు 48 గంటల్లో తమ దేశం వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో భారత్ లోని తమ బంధువులను చూసిపోయేందుకు వచ్చిన పాక్ పౌరులు దేశం విడిచిపెడుతున్నారు. వాఘా సరిహద్దుల నుంచి పాక్ వెళ్లిపోతున్నారు.

ఈ నేపథ్యంలో యూపీ యువకుడి కోసం పిల్లలతో సహా భారత్ కు వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. సీమా హైదర్ కూడా భారత్ విడిచి వెళ్లాల్సిందేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై సీమా హైదర్ లాయర్ ఏపీ సింగ్ స్పందించారు. భారత యువకుడిని వివాహం చేసుకోవడమే కాకుండా ఇక్కడే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో సీమా హైదర్ భారతీయురాలిగా మారిందని వాదిస్తున్నారు. ఆమె ఇకపై ఎంతమాత్రమూ పాక్ పౌరురాలు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఆమెకు వర్తించవని ఆయన స్పష్టం చేశారు.

సీమా హైదర్ గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్ మీనాను వివాహం చేసుకుందని, వారికి ఒక కుమార్తె కూడా జన్మించిందని ఏపీ సింగ్ గుర్తు చేశారు. వివాహం జరిగిన తర్వాత భర్త జాతీయతే భార్యకు వర్తిస్తుందని, కాబట్టి సాంకేతికంగా సీమా ఇప్పుడు భారత పౌరురాలని ఆయన అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ పౌరసత్వం కలిగి ఉన్నవారికే కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.

సీమా హైదర్ కేసు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తులో ఉందని, ఆమె బెయిల్‌పై బయట ఉంటూ న్యాయస్థానం విధించిన షరతులన్నింటినీ పాటిస్తున్నారని సింగ్ తెలిపారు. గ్రేటర్ నోయిడాలోని రబూపురాలో ఉన్న అత్తమామల ఇంటిని విడిచి వెళ్లరాదన్న నిబంధనను ఆమె గౌరవిస్తున్నారని చెప్పారు. సీమా తరపున భారత రాష్ట్రపతికి కూడా ఒక అభ్యర్థన పంపినట్లు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాలు, గార్డియన్‌షిప్ యాక్ట్ ప్రకారం బిడ్డ సంరక్షణకు తల్లే ఉత్తమమైన వ్యక్తని, భారత్‌లో జన్మించిన కుమార్తెను పాకిస్థాన్ కు పంపడం సరికాదని ఆయన వాదించారు. ఈ కారణాల దృష్ట్యా కేంద్రం ఆదేశాల నుంచి సీమాకు మినహాయింపు లభించే అవకాశం ఉందని ఏపీ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన సీమా హైదర్.. తన నలుగురు పిల్లలతో కలిసి 2023లో నేపాల్ మీదుగా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనాతో కలిసి జీవిస్తున్న విషయం తెలిసిందే.
Seema Haider
Pakistan national
India
Deportation
Sachin Meena
UP ATS
Greater Noida
Indian Citizenship
Pakistan
Illegal entry

More Telugu News