Kashmir Valley Terrorist Attacks: ఈసారి వాళ్లే టార్గెట్... ఉగ్రవాదుల తాజా ప్లాన్!

Terrorists Target Non Locals and Railway Infrastructure in Kashmir
  • కశ్మీర్ లోని రైల్వే సిబ్బంది, కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా ఉగ్రవాదుల ప్రణాళికలు
  • పసిగట్టిన నిఘావర్గాలు
  • అప్రమత్తమైన అధికారులు
జమ్మూ కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా లోయలో పనిచేస్తున్న స్థానికేతరులు, కశ్మీరీ పండిట్లు, రైల్వే మౌలిక సదుపాయాలే వారి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.

కశ్మీర్ లోయలో వివిధ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకోవాలని ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది స్థానికేతరులే కావడంతో వారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారక్‌ల నుంచి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచనలు జారీ చేసినట్లు సమాచారం. రైల్వే ప్రాజెక్టులకు కూడా ముప్పు పొంచి ఉందని, వాటిని ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆదేశాలు అందాయి.

మరోవైపు, కశ్మీరీ పండిట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ ప్రణాళికలు రచిస్తోందని కూడా నిఘా వర్గాలు పసిగట్టాయి. వీరితో పాటు శ్రీనగర్, గాందెర్బల్ జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి కూడా ప్రత్యేక హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో లోయ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అదనపు భద్రతా చర్యలు చేపడుతోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘాను ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Kashmir Valley Terrorist Attacks
Jammu and Kashmir
Terrorist Threat
Railway Employees
Kashmiri Pandits
ISIS
Security Alert
India Terrorism
Pakistani ISI
Railway Infrastructure

More Telugu News