TTD: శ్రీవారి సేవలో నిపుణులకు ఆహ్వానం... సేవకులకు శిక్షణపై టీటీడీ దృష్టి

- శ్రీవారి సేవల నాణ్యత పెంచేందుకు టీటీడీ చర్యలు
- వివిధ రంగాల నిపుణులను సేవలో భాగస్వాములను చేయాలని నిర్ణయం
- సేవకులకు ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయం
- మాస్టర్ ట్రైనర్లతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభం
- జిల్లా, ప్రాంతీయ, తిరుమల స్థాయిల్లో శిక్షణకు ప్రణాళిక
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో శ్రీవారి సేవ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు ఉన్నత స్థాయి శిక్షణ ఇవ్వడంతో పాటు, వివిధ రకాల వృత్తి నైపుణ్యం కలిగిన వారిని కూడా సేవలో భాగస్వాములను చేయాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివస్తున్న శ్రీవారి సేవకుల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఈవో అన్నారు. ఇందుకోసం వారికి ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగుపరచాలని సూచించారు. వైద్యం, విద్య, ఇంజనీరింగ్, ఐటీ, క్యాటరింగ్, సాంస్కృతికం, గోసేవ వంటి రంగాల్లోని నిపుణులను శ్రీవారి సేవలో భాగస్వాములను చేసేందుకు ఐటీ అప్లికేషన్‌లో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. ప్రవాసాంధ్రులు కూడా సేవలో పాల్గొనేలా చూడాలన్నారు.
శ్రీ సత్యసాయి సేవా సంస్థ సహకారంతో శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ మాడ్యూల్‌ను రూపొందిస్తున్నట్లు ఈవో తెలిపారు. త్వరలోనే 'ట్రైనింగ్ ది ట్రైనీస్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల నుంచి, ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి గ్రూప్ లీడర్లను ఎంపిక చేసి మాస్టర్ ట్రైనర్లుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తిరుమల ప్రాశస్త్యం, సేవకుల విధివిధానాలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై శిక్షణ ఉంటుందని వివరించారు. ఈ శిక్షణను జిల్లా, ప్రాంతీయ, తిరుమల స్థాయుల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మం, స్విమ్స్, బర్డ్, అన్నప్రసాదం, రవాణా, ఆరోగ్య విభాగాల అధికారులు పాల్గొన్నారు.