Seema Haider: ప్లీజ్‌.. న‌న్ను పాక్‌కు పంపొద్దు.. భార‌త్‌లోనే ఉంటా: సీమా హైద‌ర్‌

Seema Haider Pleads to Stay in India
  • ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో పాక్‌పై కేంద్రం క‌ఠిన ఆంక్ష‌లు
  • భారత్ లో ఉన్న పాకిస్థానీలు వెంట‌నే దేశం విడిచివెళ్లాల‌ని హుకుం
  • వారికి జారీ చేసిన వీసాల‌న్నీ ఏప్రిల్ 27తో ర‌ద్దు అవుతాయ‌ని ప్ర‌క‌ట‌న‌
  • ఈ క్రమంలో పాక్ జాతీయురాలు సీమా హైద‌ర్‌ను దేశం నుంచి బ‌హిష్క‌రిస్తార‌ని వార్త‌లు
  • దీనిపై స్పందించిన ఆమె... ఓ వీడియోను విడుద‌ల చేసిన వైనం
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం దాయాది పాకిస్థాన్ విష‌యంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా భార‌త్‌లో ఉంటున్న పాకిస్థానీల‌ను ఈ నెల 27వ తేదీ నాటికి దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల‌ని ఆదేశించింది. ఈ మేరకు భార‌త విదేశాంగ శాఖ గురువారం నాడు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

పాక్ పౌరుల‌కు జారీ చేసిన వీసాల‌న్నీ ఏప్రిల్ 27తో ర‌ద్దు అవుతాయ‌ని పేర్కొంది. అయితే, మెడిక‌ల్ వీసాల‌పై ఉన్న‌వారికి మాత్రం 29 వ‌ర‌కు అవ‌కాశం ఇచ్చింది. ఈ క్ర‌మంలో పాక్ జాతీయురాలు సీమా హైద‌ర్‌ను దేశం నుంచి బ‌హిష్క‌రిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. 

దీనిపై తాజాగా స్పందించిన ఆమె.. ఓ వీడియోను విడుద‌ల చేసింది. త‌న‌కు పాక్ వెళ్లే ఉద్దేశం లేదని, ఆ దేశానికి పంపొద్ద‌ని, భార‌త్‌లోనే ఉండేందుకు అనుమ‌తించాలంటూ ప్ర‌ధాని మోదీ, సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. ఒక‌ప్పుడు తాను పాకిస్థాన్ పౌరురాలు అయిన‌ప్ప‌టికీ, ఇప్పుడు భార‌త్ కోడ‌లిన‌ని ద‌య‌చేసి త‌న‌ను పాకిస్థాన్‌కు పంపొద్ద‌ని భార‌త ప్ర‌భుత్వాన్ని ఆమె కోరింది. 

2023లో త‌న ప్రియుడు స‌చిన్ మీనాను పెళ్లి చేసుకున్నప్పుడే హిందూమ‌తాన్ని స్వీక‌రించిన‌ట్లు గుర్తుచేసింది. దాయాది పాక్‌పై భార‌త్ అంత‌టా వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ సీమా హైద‌ర్‌ను దేశంలో నివ‌శించ‌డానికి అనుమ‌తిస్తార‌ని ఆశిస్తున్నాన‌ని ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది అన్నారు. సీమా భార‌త పౌరుడిని పెళ్లాడి... ఓ కూతురుకు జ‌న్మ‌నిచ్చింద‌ని తెలిపారు. అందుకే ఆమె పాక్ పౌరురాలు కాదని, భార‌త్‌ను విడిచివెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. 

కాగా, పాకిస్థాన్‌కు చెందిన సీమా హైద‌ర్ ఆన్‌లైన్‌లో ప‌బ్‌జీ గేమ్ ద్వారా ప‌రిచ‌య‌మైన యూపీకి చెందిన స‌చిన్ మీనా కోసం త‌న న‌లుగురు పిల్ల‌ల‌తో క‌లిసి 2023లో భార‌త్‌కు వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. దేశ స‌రిహద్దు దాటి అక్ర‌మంగా భార‌త్‌లోకి అడుగుపెట్టింది. అనంత‌రం ప్రియుడిని పెళ్లాడింది.    
Seema Haider
Pakistan national
India
Sachin Meena
Visa cancellation
Deportation
Pubg
UP
Prime Minister Modi
Yogi Adityanath

More Telugu News