K Kavitha: సీఎం రేవంత్ రెడ్డి కూడా అలాగే ఉన్నారని తెలుసుకోండి: కాంగ్రెస్ నేతలపై కవిత ఆగ్రహం

K Kavithas Anger Erupts Against Congress Leaders
  • రాహుల్ గాంధీ 'ఎలక్షన్ గాంధీ' మాత్రమేనని విమర్శ
  • తెలంగాణ సమస్యలపై రాహుల్ మౌనం ఎందుకని నిలదీత
  • కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీలు అమలు కాలేదని ఆరోపణ
  • సోనియా, రాహుల్, రేవంత్ బెయిల్‌పై ఉన్నారని వ్యాఖ్య
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు తన కేసుల గురించి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెయిల్‌పై ఉన్నారనే విషయం తెలుసుకోవాలని అన్నారు.

 రాహుల్ గాంధీ కేవలం 'ఎన్నికల గాంధీ' మాత్రమేనని, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కానీ వారి కష్టసుఖాలు పట్టవని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న పలు సంఘటనలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీని ఆమె నిలదీశారు.

"కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేసినప్పుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పచ్చని చెట్లను నరికివేయిస్తున్నప్పుడు, ఉద్యోగాలు అడిగిన విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగినప్పుడు, లగచర్లలో బంజారా మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదు?" అని ఆమె ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలు పిలిస్తే వందసార్లు వస్తానని చెప్పిన రాహుల్, గత 16 నెలలుగా ఎక్కడ ఉన్నారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు తనపై, తన కేసుల గురించి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, విమర్శలు చేసే ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెయిల్‌పై ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎదుటివారి వైపు ఒక వేలు చూపిస్తే, తమ వైపు నాలుగు వేళ్లు చూపిస్తాయన్నది తెలుసుకోవాలని అన్నారు.
K Kavitha
Revanth Reddy
Rahul Gandhi
Telangana Politics
Congress Party
BRS
Hyderabad
Bail
Political Criticism
India Politics

More Telugu News