Pawan Kalyan: షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు బిగ్ షాక్.. భూ కేటాయింపులపై సమగ్ర విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Orders Probe into Shirdi Sai Electricals Land Allotment
  • వైసీపీ హయాంలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు అటవీ భూముల కేటాయింపు
  • సత్వరమే నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 
  • 49.8 ఎకరాలను షిర్డిసాయి సంస్థకు రూ.42.48 కోట్లకు కట్టబెట్టిన వైనం
షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పీసీసీఎఫ్‌కు ఆదేశాలిస్తూ విచారణ చేసి సత్వరమే నివేదిక అందజేయాలని సూచించారు.

షిర్డిసాయి కంపెనీకి కేటాయించిన భూముల్లో అటవీ భూముల క్రమబద్దీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా విస్మరించారని, అటవీ చట్టాలను ఉల్లంఘించి కేటాయింపులు జరిపారని వచ్చిన మీడియా కథనాలను ఉప ముఖ్యమంత్రి పరిశీలించి అధికారులతో సమీక్షించారు. భూ కేటాయింపులు, సంబంధిత వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని, కేటాయింపుల ప్రక్రియపై వివరాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

జగన్ ప్రభుత్వ హయాంలో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలోని ఐటీ సెజ్ భూములను డీనోటిఫై చేయించి దానిలో 49.8 ఎకరాలను షిర్డిసాయి సంస్థకు రూ.42.48 కోట్లకు నామమాత్రపు ధరకు కట్టబెట్టారు. ఆ భూముల విలువ ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భూముల్లో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ శుచి అల్లాయ్స్ అండ్ కండక్టర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ స్థాపించింది.

అయితే విలువైన భూములను షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు అతి తక్కువ ధరకు కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పులివెందులకు చెందిన న్యాయవాది టి. జయరామ్ సమాచార హక్కు చట్టం కింద అటవీ శాఖకు ఇటీవల దరఖాస్తు చేస్తూ వివరాలు కోరారు. దీంతో ఆ శాఖ వివరాలు అందించింది. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నిర్మించిన పరిశ్రమ ప్రాంతం శేషాచలం వన్యప్రాణి అభయారణ్యంగా పీసీసీఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కి నివేదికను కూడా సమర్పించింది.

సదరు పరిశ్రమ తమ శాఖ పరిధిలోని భూములలో వన్య, అటవీ చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని తాజాగా గుర్తించారు. అటవీశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసినట్లు గుర్తించిన అధికారులు సదరు సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయం మొత్తం మీడియాలో రావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించి విచారణకు ఆదేశించారు. 
Pawan Kalyan
Shirdi Sai Electricals
Land Allotment Scam
Forest Land Encroachment
Sheshachallam Wildlife Sanctuary
Jagan Mohan Reddy
NGT

More Telugu News