Revanth Reddy: ఎల్కతుర్తిలో కేసీఆర్ ప్రసంగంపై తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddys Strong Reaction to KCRs Elgatur Speech
  • కేసీఆర్ ప్రసంగం అక్కసుతో ఉందని, స్పష్టత లోపించిందని విమర్శ
  • ఖజానా ఖాళీ చేసి నిందలు వేస్తున్నారని కేసీఆర్‌పై ఆరోపణ
  • రాహుల్ గాంధీతో తనకు గ్యాప్ లేదని స్పష్టం చేసిన రేవంత్
  • మావోయిస్టులతో చర్చలకు శాంతి కమిటీ ఏర్పాటుపై జానారెడ్డితో సీఎం భేటీ
బీఆర్ఎస్ ఎల్కతుర్తిలో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ప్రసంగం పూర్తిగా అక్కసుతో నిండి ఉందని, ఆయన మాటల్లో స్పష్టత కొరవడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

రాష్ట్ర ఖజానాను కేసీఆర్ పూర్తిగా ఖాళీ చేసి, ఇప్పుడు ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, తనకు మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాహుల్ గాంధీతో తనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని స్పష్టం చేశారు.

అవసరాలకు అనుగుణంగా కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ తమ వైఖరిని మార్చుకుంటున్నారని విమర్శించారు. దేశానికి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ లాంటి నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, రాష్ట్రంలో మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు వీలుగా ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై పార్టీలో తదుపరి చర్చల బాధ్యతను జానారెడ్డి, మరో సీనియర్ నేత కె. కేశవరావు చూస్తారని చెప్పారు.

ఎమ్మెల్యేలకు హెచ్చరిక

ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని, వారు వెళితేనే పథకాలు ప్రజల్లోకి వెళతాయని అన్నారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ నేతలే నష్టపోతారని హెచ్చరించారు.
Revanth Reddy
KCR
Telangana Politics
BRS
Congress
Rahul Gandhi
Janareddy
Elgatur
Telangana Assembly
Maoist Talks

More Telugu News