Rahul Gandhi: ఉగ్రదాడి నేపథ్యంలో మోదీకి రాహుల్ గాంధీ లేఖ

Rahul Gandhis Letter to Modi Amidst Terror Attack
  • పార్లమెంట్ ప్రత్యేక సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని కోరిన రాహుల్
  • దాడి బాధితులకు నివాళి, భవిష్యత్ చర్యలపై చర్చకు పిలుపు
  • ఉగ్రవాదంపై దేశం ఐక్యత చాటాలని లేఖలో విజ్ఞప్తి
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంయుక్తంగా ఈ లేఖను పంపారు. పహల్గామ్ దాడి పరిణామాలపై చర్చించేందుకు వీలైనంత త్వరగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు తమ లేఖలో ప్రధానిని కోరారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యావత్తూ ఐక్యంగా నిలుస్తుందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉందని రాహుల్, ఖర్గే తమ లేఖలో నొక్కి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి సభ నివాళులర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలపై పార్లమెంట్ వేదికగా సమగ్రంగా చర్చించాలని వారు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, పహల్గామ్ దాడి జరిగిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై, ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంపై పోరులో కేంద్ర ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అనంతరం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడంతో పాటు, తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. అయితే, ఆ కీలక సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాకపోవడాన్ని మల్లికార్జున ఖర్గే అప్పట్లోనే తప్పుబట్టారు.

ప్రధాని స్వయంగా హాజరై పరిస్థితిని వివరిస్తే బాగుండేదని ఖర్గే అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మరోసారి పార్లమెంట్ సమావేశాల ఆవశ్యకతను గుర్తుచేస్తూ రాహుల్ గాంధీతో కలిసి ప్రధానికి లేఖ రాశారు. వీరితో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఇదే తరహా డిమాండ్లు చేశారు. టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ, ఆప్ నేత సంజయ్ సింగ్ ఈ దాడి ఘటన భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోందని, దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యులు కపిల్ సిబల్ సైతం ప్రధానికి లేఖ రాస్తూ, ఉగ్రవాదంపై దేశం ఐక్యంగా ఉందని చాటేందుకు పార్లమెంటులో ఏకగ్రీవ తీర్మానం చేయాలని, ఇందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
Rahul Gandhi
Modi
Parliament Session
Terrorist Attack
Pulwama Attack
Jammu and Kashmir
National Security
Mallikarjun Kharge
Sudeep Bandopadhyay
Sanjay Singh
Kapil Sibal

More Telugu News