Kolkata Hotel Fire: కోల్ కతా హోటల్ లో అగ్ని ప్రమాదం.. 15 మంది మృతి

Deadly Hotel Fire in Kolkata Claims 15 Lives
  • రీతూరాజ్ హోటల్‌లో మంగళవారం రాత్రి దుర్ఘటన
  • మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు
  • ప్రాణాలు కాపాడుకునేందుకు ఆరో అంతస్తు నుంచి దూకిన వ్యక్తి మృతి
  • మంటలు అదుపులోకి, కొనసాగుతున్న సహాయక చర్యలు, దర్యాప్తు
కోల్‌కతాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నగరంలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ, ఇద్దరు పిల్లలతో సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఫాల్‌పట్టి మచ్ఛువా ప్రాంతానికి సమీపంలో ఉన్న రీతూరాజ్ హోటల్‌లో రాత్రి 8:15 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అవి హోటల్ అంతటా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో చాలామంది ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.

ప్రాణభయంతో కొందరు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటపడే ప్రయత్నం చేయగా, మరికొందరు గదుల్లోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఊపిరాడక పది మంది తమ గదుల్లోనే మరణించారు. తప్పించుకునే ప్రయత్నంలో మరో ముగ్గురు మెట్లపైనే కుప్పకూలిపోయారు.

ప్రాణాలు కాపాడుకునేందుకు ఆరో అంతస్తు నుంచి దూకిన మరో వ్యక్తి కూడా దుర్మరణం పాలయ్యాడు. హోటల్ లో నుంచి 15 మృతదేహాలను వెలికితీసినట్లు కోల్‌కతా పోలీస్ కమీషనర్ మనోజ్ కుమార్ వర్మ తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మీడియాకు వివరించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కమీషనర్ వర్మ వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Kolkata Hotel Fire
Rituraj Hotel Fire
Kolkata Fire Accident
Hotel Fire Deaths
Manoj Kumar Verma
West Bengal Fire
India Hotel Fire
Fatal Hotel Fire
Fire Safety

More Telugu News