PBKS vs CSK: పంజాబ్ సూప‌ర్‌ విక్ట‌రీ.. చెన్నై ఇంటికి

Punjab Kings Triumphs Over Chennai Super Kings
  • నిన్న చెపాక్ స్టేడియంలో త‌ల‌ప‌డ్డ సీఎస్‌కే, పీబీకేఎస్‌
  • 4 వికెట్ల తేడాతో చెన్నైను చిత్తు చేసిన పంజాబ్
  • హాఫ్ సెంచ‌రీల‌తో రాణించిన ప్ర‌భ్‌సిమ్ర‌న్ (54), శ్రేయ‌స్ అయ్య‌ర్ (72) 
  • పంజాబ్‌పై ఓట‌మితో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన చెన్నై
చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) మెరిసింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే)ను సొంత మైదానంలో ఓడించింది. చెన్నై నిర్దేశించిన 191 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ 19.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్ర‌న్ (54), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (72) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. 

అంత‌కుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 19.2 ఓవ‌ర్ల‌లో 190 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఒకానొక ద‌శ‌లో 200+ స్కోర్ ఖాయ‌మ‌నుకున్న ఈ మ్యాచ్‌లో చెన్నై ఆఖ‌రి 3 ఓవ‌ర్ల‌లో త‌డ‌బ‌డింది. 11 బంతుల వ్య‌వ‌ధిలో 6 వికెట్లు కోల్పోయింది. హ్యాట్రిక్ స‌హా ఒకే ఓవ‌ర్‌లో 4 వికెట్లు తీసి స్పిన్న‌ర్‌ చాహ‌ల్ చెన్నైని కోలుకోని దెబ్బ కొట్టాడు. ఐపీఎల్‌లో అత‌నికి ఇది రెండో హ్యాట్రిక్‌. 2022 సీజ‌న్‌లోనూ చాహ‌ల్ హ్యాట్రిక్ న‌మోదు చేశాడు. 

ముఖ్యంగా స్టార్ బ్యాట‌ర్ సామ్ క‌ర‌న్ (88) ఔటైన త‌ర్వాత సీఎస్‌కే వ‌రుస‌గా వికెట్లు పారేసుకుని 190 ర‌న్స్‌కే ప‌రిమిత‌మైంది. చెన్నై బ్యాట‌ర్ల‌లో బ్రెవిస్ (32), ర‌వీంద్ర‌ జ‌డేజా (17), ధోనీ (11) ప‌రుగులు చేశారు. అనంత‌రం 191 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన పంజాబ్ 4 వికెట్ల తేడాతో చెన్నైను చిత్తు చేసింది. 

ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్ర‌న్ అర్ధ‌శ‌త‌కం (54)తో రాణించ‌గా... శ్రేయ‌స్ అయ్య‌ర్ 41 బంతుల్లోనే 72 ర‌న్స్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టుకు సునాయాస విజ‌యాన్ని అందించాడు. శ‌శాంక్ సింగ్ (23), ప్రియాంశ్ ఆర్య (23) ప‌ర్వాలేద‌నిపించారు. చెన్నై బౌల‌ర్ల‌లో ఖ‌లీల్, ప‌తిర‌ణ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. 

ఈ విజ‌యంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి ఎగ‌బాకింది. ప్లేఆఫ్స్‌కు మ‌రింత చేరువైంది. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచులాడి ఆరు విజ‌యాలు సాధించింది. మ‌రోవైపు పంజాబ్‌పై ఓట‌మితో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన తొలి జ‌ట్టుగా నిలిచింది. 
PBKS vs CSK
Punjab Kings
Chennai Super Kings
IPL 2024
Cricket Match
Chepauk Stadium
Prabhsimran Singh
Shreyas Iyer
Chahal
Sam Curran

More Telugu News