Chiranjeevi: ఆ విషయాల్లో అమితాబ్, కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి నాకు స్ఫూర్తి: చిరంజీవి

Chiranjeevis role models in Indian Cinema
  • ముంబై వేదికగా జరుగుతున్న వేవ్స్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి
  • తాను సినీ పరిశ్రమలో అడుగుపెట్టే సమయానికే ఎందరో సూపర్ స్టార్లు ఉన్నారని వ్యాఖ్య
  • ఎలాగైనా అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగానని వెల్లడి
ముంబై వేదికగా జరుగుతున్న 'వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్' (వేవ్స్‌)లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణంలో వివిధ దశల్లో తనకు స్ఫూర్తినిచ్చిన దిగ్గజ నటుల గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో తన ఎదుగుదలకు దోహదపడిన అంశాలను గుర్తుచేసుకున్నారు.

చిన్నతనంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్నానని, కుటుంబ సభ్యులు, స్నేహితులను అలరించడానికి డ్యాన్స్ చేసేవాడినని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఆ ఆసక్తే తనను నటన వైపు నడిపించిందని, అందుకోసం చెన్నై వెళ్లానని తెలిపారు. తాను సినీ రంగంలోకి అడుగుపెట్టే సమయానికి అప్పటికే ఎందరో దిగ్గజ నటులు, సూపర్‌ స్టార్లు ఉన్నారని చిరంజీవి అన్నారు. "వారందరి మధ్య నేను ప్రత్యేకంగా ఏం చేయగలను అని మొదట అనిపించింది. అయినా, ఎలాగైనా అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగాను" అని వివరించారు.

1977లో నటనలో శిక్షణ తీసుకున్నట్లు చిరంజీవి తెలిపారు. మేకప్ లేకుండా సహజంగా నటించడం మిథున్ చక్రవర్తి నుంచి నేర్చుకున్నానని చెప్పారు. ఇక స్టంట్స్ విషయంలో అమితాబ్ బచ్చన్, డ్యాన్స్ విషయంలో తన సీనియర్ కమల్ హాసన్ తనకు ఎంతో ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. "వారి సినిమాలను నిశితంగా గమనిస్తూ, నటనలోని మెళకువలను నేర్చుకుంటూ నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను" అని చిరంజీవి వెల్లడించారు.

అంతర్జాతీయ స్థాయిలో భారతీయ వినోద పరిశ్రమను గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'వేవ్స్' సదస్సును నిర్వహిస్తోంది. ఈరోజు ప్రారంభమైన ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సు అడ్వైజరీ బోర్డులో చిరంజీవి కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో చిరంజీవితో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ఆమిర్‌ఖాన్‌ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. 
Chiranjeevi
Amitabh Bachchan
Kamal Haasan
Mithun Chakraborty
Waves Summit
Indian Cinema
Telugu Cinema
Tollywood
Bollywood
Inspiration

More Telugu News