Kishan Reddy: ఎడ్ల బండిని తానే మోస్తున్నట్లు కుక్క భావిస్తుంది: కాంగ్రెస్ పార్టీపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

Kishan Reddy Slams Congress Over Caste Census
  • బీసీలకు న్యాయం చేసేందుకే బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్న కిషన్ రెడ్డి
  • దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కులగణన ప్రస్తావన లేదని వ్యాఖ్య
  • బీసీలను పక్కనపెట్టి ముస్లింలకు కాంగ్రెస్ ప్రాధాన్యమిచ్చిందని ఆరోపణ
  • సామాజిక న్యాయం కోసమే కులగణన... ఒత్తిడితో తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టీకరణ
  • తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ కులగణన నామమాత్రమేనని విమర్శ
ఎడ్లబండి కింద వెళ్లే కుక్క తానే బరువు మోస్తున్నట్లుగా భావిస్తుంటుందని, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో వాగ్దానాలు తప్ప వాస్తవాలు ఏమీ లేవని అన్నారు. బీసీలకు న్యాయం చేకూర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన ఊసే ఎత్తలేదని, ఇప్పుడు దానిపై రాజకీయ లబ్ధి పొందాలని చూడటం విడ్డూరంగా ఉందని అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో సమగ్ర కులగణన జరగలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. బీసీలకు మేలు చేస్తుందన్న మండల్ కమిషన్ సిఫార్సులను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీల ప్రయోజనాలను విస్మరించి, ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్‌లా ముస్లింలను బీసీల జాబితాలో చేర్చి, బీసీల గణాంకాలను తప్పుగా చూపించే ప్రయత్నం చేయదని ఆయన స్పష్టం చేశారు.

2011 జనాభా గణనలోనే కులాల వివరాలు చేర్చాలని నాటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అప్పటి ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో కులగణన చేపడితే ఏయే సామాజిక వర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుందని, తద్వారా వారికి ప్రత్యేక పథకాలు రూపొందించి, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కలిగించడానికి వీలవుతుందని ఆయన వివరించారు.

కులగణన నిర్ణయాన్ని తమ విజయంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి అన్నారు. "నిజంగా చిత్తశుద్ధి ఉంటే గడిచిన 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు కులగణన చేపట్టలేదు?" అని ఆయన ప్రశ్నించారు. ఇది రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వంటి నేతలకు భయపడి తీసుకున్న నిర్ణయం కాదని, సామాజిక న్యాయం పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన కులగణనలు కేవలం తూతూమంత్రంగా జరిగాయని, అవి నిజమైన కులగణనలు కావని ఆయన ఆరోపించారు. బీసీల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను నమ్మవద్దని ఆయన తెలిపారు.
Kishan Reddy
Congress Party
Caste Census
Telangana Politics
BJP
BC Welfare
Rahul Gandhi
Revanth Reddy
Social Justice
Political Criticism

More Telugu News