Vaibhav Suryavanshi: క్రికెట్ లో కూడా వయసు తగ్గించుకుని ఆడేస్తున్నారుగా.. విజేందర్ వ్యాఖ్యలు సూర్యవంశి గురించేనా?

Vijender Singhs Comments Spark Age Fraud Debate in Cricket
 
భారత బాక్సింగ్ దిగ్గజం, ఒలింపిక్ కాంస్య పతక విజేత విజేందర్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇతర క్రీడల్లో తరచూ వినిపించే వయసు తగ్గింపు (ఏజ్ ఫ్రాడ్) ఆరోపణలు ఇప్పుడు క్రికెట్‌లోకి కూడా ప్రవేశించాయా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వయసుపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో విజేందర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో, "భాయ్ ఆజ్ కల్ ఉమర్ చోటీ కర్ కే క్రికెట్ మే భీ ఖేల్నే లగే (సోదరా, ఈ రోజుల్లో వయసు తగ్గించుకుని క్రికెట్‌లో కూడా ఆడేస్తున్నారుగా)" అని హిందీలో పోస్ట్ చేశారు.

ఇటీవల జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన శతకంతో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా శతకం బాదిన భారత ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 38 బంతుల్లో 101 పరుగులు సాధించిన అతను (14 ఏళ్ల 32 రోజులు), ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా, టీ20 క్రికెట్ చరిత్రలోనే సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

అయితే, వైభవ్ అసాధారణ ప్రతిభ, శారీరక పటుత్వం చూసి అతని వయసుపై కొందరు నెటిజన్లు సందేహాలు లేవనెత్తారు. అతని పాత ఇంటర్వ్యూ వీడియోలను షేర్ చేస్తూ, అతను పేర్కొంటున్న దానికంటే వయసులో పెద్దవాడిగా కనిపిస్తున్నాడని కొందరు వాదిస్తున్నారు. "వైభవ్ వయసు 14 ఏళ్లు అంటే నమ్మశక్యంగా లేదు. ఇది 3-4 ఏళ్ల క్రితం వీడియో. అతని వయసు కన్నా ఎక్కువగానే కనిపిస్తున్నాడు. బీసీసీఐ దీనిపై లోతుగా విచారణ జరిపి, వయసు తగ్గింపు నిజమని తేలితే నిషేధం విధించాలి" అని ఒక నెటిజన్ డిమాండ్ చేశారు. "ఒకవేళ వయసు విషయంలో మోసం జరిగినా, 15-16 ఏళ్ల వయసులో ఇంతటి పవర్ హిట్టింగ్ అసాధారణం" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.

ఈ చర్చల మధ్యే విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, భారత క్రీడల్లో, ముఖ్యంగా జూనియర్, ఏజ్-గ్రూప్ స్థాయిలలో వయసును తక్కువగా చూపించి అవకాశాలు పొందడం అనేది ఎప్పటినుంచో ఉన్న సమస్య. దీనిని అరికట్టడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వయసు నిర్ధారణ ప్రక్రియలను కఠినతరం చేయడం సహా పలు చర్యలు తీసుకుంటోంది. విజేందర్ సింగ్ తాజా వ్యాఖ్యలతో క్రికెట్‌లోనూ ఏజ్ ఫ్రాడ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
Vaibhav Suryavanshi
Age Fraud in Cricket
IPL Age Controversy
Vijender Singh
Rajasthan Royals
BCCI
Underage Cricketers
Youth Cricket
Indian Cricket

More Telugu News