Kishan Reddy: అందుకే కిషన్ రెడ్డి షాక్‌లో ఉన్నారు: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Kishan Reddy Under Pressure Jagga Reddys Explosive Comments
  • బీజేపీ అధ్యక్షుడిగా ఫెయిల్ అయ్యాననే భావన ఆయనలో ఉందని వ్యాఖ్య
  • కిషన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి మొట్టికాయలు పడి ఉంటాయన్న జగ్గారెడ్డి
  • కులగణనపై కిషన్ రెడ్డి తప్పుడు ప్రకటన చేశారని విమర్శ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం షాక్‌లో ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన విఫలమయ్యారనే భావనలో ఉండడం వల్లనే ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. ఆయనకు తన పార్టీ అధిష్ఠానం నుంచి మొట్టికాయలు పడి ఉంటాయని అభిప్రాయపడ్డారు.

'మీరు తెలంగాణలో ఏం చేస్తున్నారు?' అని అధిష్ఠానం ప్రశ్నించి ఉంటుందని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి సాధారణంగా వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటారని, కానీ ఈ మధ్య తరచూ ప్రకటనలు చేస్తూ ఉండటం గమనించామన్నారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనపై ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉండవచ్చని పేర్కొన్నారు.

బీసీ కులగణనలో తప్పులున్నాయని కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను జగ్గారెడ్డి తప్పుబట్టారు. కులగణన పక్కాగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సర్వే జరిగిన నెల రోజులు కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉండి, ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో శ్రమించి కులగణన చేశామని, దాని ఫలితం తమకు దక్కుతుందని అన్నారు. 95 ఏళ్ల తర్వాత కులగణన జరిగిందని గుర్తు చేశారు.

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఈ మధ్య ఎక్కువగా మాట్లాడటం లేదని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజకీయ లబ్ధి కంటే సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యమని రాహుల్ గాంధీ భావిస్తారని అన్నారు. ఓట్ల కోసం రాజకీయాలు చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
Kishan Reddy
Jagga Reddy
Telangana BJP
BC Census
Telangana Politics
India Politics
BJP
Congress
Bundi Sanjay
Rahul Gandhi

More Telugu News