Pakistan Stock Market Crash: పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కు పట్టపగలే చుక్కలు!

Pakistan Stock Market Crashes After Pulwama Attack
  • భారత్‌తో ఉద్రిక్తతలు.. పాక్ స్టాక్ మార్కెట్ కుదేల్!
  • KSE-100 సూచీ ఏప్రిల్ 23-30 మధ్య 7,100 పాయింట్ల నష్టం
  • ఏప్రిల్ 30న ఒక్కరోజే 3,545 పాయింట్లు క్షీణించిన సూచీ
  • పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న కఠిన చర్యలే కారణమని విశ్లేషణ.
భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పహల్గామ్‌లో 26 మంది మృతికి కారణమైన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (KSE-100) సూచీ భారీగా పతనమైంది.

ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 మధ్య కాలంలో KSE-100 సూచీ ఏకంగా 7,100 పాయింట్లకు పైగా (సుమారు 6 శాతం) నష్టపోయింది. ముఖ్యంగా ఏప్రిల్ 30న మార్కెట్ చరిత్రలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా కుదేలైంది. ఆ ఒక్క రోజే సూచీ 3.09 శాతం క్షీణించి, 3,545 పాయింట్లు కోల్పోయి 111,326.57 వద్ద ముగిసింది. ఈటీ నివేదిక ప్రకారం, LUCK, ENGROH, UBL, PPL, FFC వంటి కీలకమైన షేర్లు భారీగా నష్టపోయి, సూచీ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఈ షేర్ల వల్లనే సూచీ 1,100 పాయింట్లకు పైగా నష్టపోయిందని తెలిసింది.

అయితే, మే 2వ తేదీన మార్కెట్ కొంత ఊరట చెందింది. సూచీ 2,785 పాయింట్లు (2.5 శాతం) పెరిగి 114,119 వద్ద ముగిసింది. కానీ, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపడితే తప్ప ఈ పెరుగుదల తాత్కాలికమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ అనేక కఠినమైన ప్రతిచర్యలకు ఉపక్రమించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అట్టారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను మూసివేయడం, ఇరు దేశాల హైకమిషన్లలో దౌత్య సిబ్బందిని తగ్గించడం వంటి చర్యలు తీసుకుంది. అంతేకాకుండా, ఎలాంటి ప్రతిస్పందన వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై పూర్తి స్వేచ్ఛను భారత సైన్యానికి అప్పగించింది. లక్ష్యాలు, వ్యూహాల ఎంపికతో సహా అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీనియర్ రక్షణ అధికారులకు ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు, ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాలని అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి రిజ్వాన్ సయీద్ షేక్ కోరినట్లు తెలుస్తోంది. కశ్మీర్ అంశం కీలకమైన అంతర్జాతీయ వివాద ప్రాంతమని, ఈ విషయంలో వాషింగ్టన్ మధ్యవర్తిత్వం వహించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టు ది న్యూస్‌వీక్ పత్రిక పేర్కొంది.
Pakistan Stock Market Crash
Pulwama Attack Aftermath
India-Pakistan Tensions
KSE-100 Index
Donald Trump
Rizwan Saeed Sheikh
Kashmir Dispute
Economic Impact
Geopolitical Risks
Stock Market Volatility

More Telugu News