Ponguleti Srinivas Reddy: అనర్హులని తేలితే నిర్మాణం మధ్యలో ఉన్నా ఇంటి కేటాయింపును రద్దు చేస్తాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక

Telangana Ministers Warning on Indiramma Housing Scheme
  • ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలన్న మంత్రి
  • నిరు పేదలకే ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రి
  • నిర్మించే ఇళ్ల విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదన్న మంత్రి
ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన నిరుపేదలను గుర్తించడంలో జాప్యం చేయవద్దని, ఒకవేళ అనర్హులని తేలితే నిర్మాణం మధ్యలో ఉన్నప్పటికీ కేటాయింపును రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

నేడు సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రి పొంగులేటి.. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ గృహాల కేటాయింపు అత్యంత పారదర్శకంగా జరగాలని, జాబితా 1, 2, 3లతో సంబంధం లేకుండా అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి గృహాలను కేటాయించాలని దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని, ఒకవేళ ఎవరైనా అనర్హులని తేలితే, నిర్మాణం మధ్యలో ఉన్నప్పటికీ వారి ఇంటి కేటాయింపును రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

ఎంపిక చేసిన లబ్ధిదారుల తుది జాబితాకు సంబంధిత జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. నిర్మించే ఇళ్ల విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని, ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో 500 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అలాగే, భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని 28 మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ సదస్సుల ద్వారా ప్రజల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఈ నెల 4న జరగనున్న జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి మొత్తం 72,572 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని, ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, ముఖ్యంగా తాగునీటి వసతితో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అవసరమైన మెడికల్‌ కిట్‌లను అందుబాటులో ఉంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణ సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.
Ponguleti Srinivas Reddy
Indiramma Housing Scheme
Telangana
Revenue Minister
Housing Allocation
NEET Exam
Bhoomi Bharathi
Ineligible Beneficiaries
Transparent Allocation
Government Schemes

More Telugu News