Chandrababu Naidu: అమరావతికి నవశకం... ప్రధానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

Chandrababu Naidu Thanks PM Modi for Amaravati Development
  • అమరావతిలో కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
  • రాష్ట్రానికి ఇది నవశకం, చీకటిపై ఆశ గెలిచిందన్న ముఖ్యమంత్రి
  • ప్రధాని పర్యటన, ప్రసంగంపై సీఎం హర్షం, కృతజ్ఞతలు
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణంపై నిబద్ధత
  • అమరావతి ప్రజల కలల ప్రతిరూపమని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అమరావతికి ఇది ఒక నవశకమని, చీకటిపై ఆశ గెలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో కీలక అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి, ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రజా రాజధాని అభివృద్ధికి పునాది వేసిన ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. 

సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు తమకంటూ ఒక రాజధాని ఉండాలని ఆశించారని, దాని కోసం పోరాడారని, ఆ స్వప్నాన్ని నిలుపుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్ఫూర్తిదాయక ప్రసంగం, రాష్ట్ర పురోగతి కోసం మరింత కష్టపడి పనిచేయాలనే తమ నిబద్ధతకు పునరుజ్జీవం కల్పించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతు, ప్రజలు ఆశించిన రాజధానిని నిర్మించగలమనే విశ్వాసాన్ని మరింత బలపరిచిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

అమరావతి కేవలం కాంక్రీటు, ఉక్కు కట్టడం మాత్రమే కాదని, అది రాష్ట్ర ప్రజల కలలకు, ఆశయాలకు నిలువెత్తు నిదర్శనమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను అందరం కలిసికట్టుగా నిజం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu Naidu
Amaravati
Narendra Modi
Andhra Pradesh
Capital City
Development
Foundation Stone
National Importance
New Era
India

More Telugu News