Raghunandan Rao: నల్గొండ ఆ రెండు రకాల తీవ్రవాదాలకు ఆడ్డాగా మారింది: రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

Raghunandan Raos Explosive Claims Nalgonda a Hub for Two Types of Extremism
  • జిల్లా వామపక్ష, ఐఎస్ఐ తీవ్రవాదాలకు నిలయంగా మారిందని ఆరోపణ
  • మదర్సాలను కూడా పాఠశాలల తరహాలో తనిఖీ చేయాలని డిమాండ్
  • రాష్ట్రంలో ఆలయాలపై ఘటనల వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం
నల్గొండ జిల్లా రెండు రకాల తీవ్రవాదాలకు అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నల్గొండ అత్యంత సున్నితమైన జిల్లా అని, ఇక్కడ వామపక్ష తీవ్రవాదంతో పాటు ఐఎస్ఐ సంబంధిత కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.

ఈ రెండు రకాల తీవ్రవాద శక్తులు బీజేపీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని, అయినప్పటికీ తమ పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఇటీవల పహల్గామ్‌లో మతం పేరుతో హిందువులపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, దేశంలో పరిస్థితులు ఎటువైపు వెళుతున్నాయో సమాజం ఆలోచించాలని అన్నారు. వివిధ పేర్లతో జిహాద్ జరుగుతోందని, మదర్సాల ద్వారా కూడా ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు.

పాఠశాలలు, కళాశాలలను తనిఖీ చేస్తున్నట్లే జిల్లా కలెక్టర్, ఎస్పీలు మదర్సాలను కూడా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. మదర్సాలలో ఎవరు నివసిస్తున్నారు, వారికి ఎలాంటి బోధనలు అందుతున్నాయనే విషయాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మదర్సాల వ్యవహారంపై కూడా దృష్టి సారించాలని సూచించారు.

నల్గొండ వంటి ప్రాంతాల్లో ఐఎస్ఐ ఉగ్రవాదులు నేరాలకు పాల్పడుతుంటే, జిల్లా అధికారులు మదర్సాలు, రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల లెక్కల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అధికారం మారినప్పుడల్లా ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి పాలకులకు అనుకూలంగా పనిచేయడంలో విఫలమవుతోందని ఆరోపించారు.

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి, సదాశివపేట, కొమురవెల్లిలలో ఇటీవల ఆలయాల్లో జరిగిన ఘటనలను రఘునందన్ రావు ప్రస్తావించారు. కొమురవెల్లి ఘటనలో మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి విగ్రహంపై మూత్ర విసర్జన చేశారని, జిన్నారం ఘటనలో కోతులు విగ్రహాన్ని పడేశాయని పోలీసులు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు కేవలం ఆలయాలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని, మసీదులు, చర్చిలలో ఇలాంటి సంఘటనలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కోతులు పడగొట్టేంత తేలికగా విగ్రహాలు ఉంటాయా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Raghunandan Rao
BJP MP
Nalgonda
Terrorism
ISI activities
Left-wing extremism
Madrasas
Rohingya
Bangladesh
Temple attacks

More Telugu News