Kotamreddy Sridhar Reddy: 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి... కోటంరెడ్డిని అభినందించిన నారా లోకేశ్

Kotamreddy Sridhar Reddy Applauded by Nara Lokesh for Rapid Development
  • నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం... మంత్రి లోకేశ్ ప్రశంసలు
  • తక్కువ సమయంలో ఇన్ని పనులు పూర్తి చేయడం రికార్డు స్థాయి పనితీరుకు నిదర్శనమని కితాబు
  • కోటంరెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేశారని అభినందనలు
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రికార్డు సమయంలో అభివృద్ధి పనులు పూర్తి చేసిన స్థానిక శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన బృందం పనితీరును రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అభినందించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వారి నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి, కేవలం 60 రోజుల వ్యవధిలోనే రూ.41 కోట్ల అంచనా వ్యయంతో 339 అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం ఒక విశేషమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని పనులు పూర్తి చేయడం రికార్డు స్థాయి పనితీరుకు నిదర్శనమని అభివర్ణించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన బృందం పనితీరు స్ఫూర్తిదాయకమన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేసిందని లోకేశ్ తెలిపారు. ఈ స్వల్ప కాలంలోనే రూ.231 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలో ప్రారంభించినట్లు ఆయన వివరించారు. 

తమపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి ఫలాలను ప్రతి గడపకూ చేర్చడంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చూపిస్తున్న చొరవ, కృషి ఆదర్శనీయమని మంత్రి కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, అభివృద్ధికి చిరునామాగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే తపన ప్రశంసనీయమని నారా లోకేశ్ వివరించారు.
Kotamreddy Sridhar Reddy
Nara Lokesh
Nellore Rural
Andhra Pradesh
Development Projects
MLA
Minister
Record Time
Public Welfare
60 Days

More Telugu News