Botsa Satyanarayana: వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana on YSRCPs Defeat Multiple Reasons Cited
  • కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ. 1.50 లక్షల కోట్ల అప్పు చేసిందన్న బొత్స
  • అభివృద్ధి, సంక్షేమాన్ని జగన్ రెండు కళ్లుగా చూశారని కితాబు
  • మూడు టీవీ ఛానళ్లు, పేపర్లతో చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శ
గత ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్టుగా... వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. అనకాపల్లి జిల్లాలో ఈరోజు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బొత్స, గుడివాడ్ అమర్ నాథ్, ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు, వరుదు కల్యాణి, శోభ హైమావతి, బొడ్డేడ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇదే సమయంలో ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే రూ. 1.50 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. మళ్లీ పెళ్లి అన్నట్టుగా అమరావతి పనులకు పునఃప్రారంభం చేశారని ఎద్దేవా చేశారు. అమరావతికి వచ్చిన మోదీ ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కూటమి నేతల ప్రచార పిచ్చితో సింహాచలం ఆలయం వద్ద ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయని అన్నారు. ఈ మరణాలన్నీ ప్రభుత్వం హత్యలేనని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా జగన్ చూశారని బొత్స అన్నారు. చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కూటమి 11 నెలల పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని అన్నారు. రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో ప్రజలు గమనించాలని చెప్పారు. మూడు టీవీ ఛానళ్లు, మూడు పేపర్లతో చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. 
Botsa Satyanarayana
YSRCP
Andhra Pradesh Politics
TDP
Chandrababu Naidu
Amaravati
Modi
Election Analysis
State Politics
Welfare Schemes

More Telugu News