Pawan Kalyan: ఈ సమస్యపై భారత్, శ్రీలంక ప్రభుత్వాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan on Fishermen Issue between India and Sri Lanka
  • తమిళనాడు మత్స్యకారుల ఘటనలపై పవన్ ఆందోళన
  • సమస్య పరిష్కారానికి భారత్, శ్రీలంక ప్రభుత్వాలు చర్చలు జరపాలని సూచన
  • మోదీ, చంద్రబాబుతో కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తామని వెల్లడి
బంగాళాఖాతంలో ఇటీవల తమిళనాడుకు చెందిన 24 మంది మత్స్యకారులు శ్రీలంక అధికారుల వల్ల ఇబ్బందులకు గురైన ఘటనలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాగపట్నం జిల్లా మత్స్యకారులు గాయపడటం బాధాకరమని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, తరచూ పునరావృతమవుతున్న ఈ తరహా ఘటనలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు. ఇరు దేశాల ప్రభుత్వాలు నిర్మాణాత్మక చర్చలు జరిపి, మత్స్యకారుల భద్రతకు, గౌరవానికి భంగం కలగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ విమర్శించడం, ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం తెలిసిందే.

ఏపీకి అమరావతే ఏకైక, శాశ్వత రాజధాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే ఏకైక, శాశ్వత రాజధానిగా నిలుస్తుందని పవన్ స్పష్టం చేశారు. ఇది కేవలం కాంక్రీట్ నిర్మాణాల సముదాయం కాదని, ప్రజాస్వామ్యానికి, జవాబుదారీతనానికి, న్యాయానికి ప్రతీకగా ఉంటుందని ఆయన అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను కొనియాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సహకారంతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. యువత ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వలస వెళ్లే అవసరం లేకుండా అమరావతే ఉపాధి అవకాశాల కేంద్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

గత ఐదేళ్లలో రాజధాని రైతులు తీవ్రంగా నష్టపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 29 వేలకు పైగా రైతులు 34 వేల ఎకరాలకు పైగా భూములను త్యాగం చేస్తే, గత ప్రభుత్వం వారి త్యాగాలను అవమానించిందని మండిపడ్డారు. రైతులు రోడ్లపైకి వచ్చి ముళ్ల కంచెల మధ్య ఆందోళనలు చేయాల్సి వచ్చిందని, లాఠీ దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఎంతోమంది రైతులు ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ఆనాడు రైతులు పడ్డ కష్టాలను ప్రధాని దృష్టికి తీసుకెళతామని, అమరావతే రాజధానిగా ఉంటుందని తాను హామీ ఇచ్చానని, నేడు ఆ మాట నిలబెట్టుకుంటున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Pawan Kalyan
Sri Lanka
India
Fishermen
Tamil Nadu
Amaravati
Andhra Pradesh
Capital
Farmers
Narendra Modi
Chandrababu Naidu

More Telugu News