Nara Lokesh: శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారీ యూనిట్.. మే 8న మంత్రి లోకేశ్ భూమిపూజ

LG Electronics to Set Up Unit in SriCity Andhra Pradesh
  • రూ.5001 కోట్లతో ఎల్జీ ప్లాంట్... 2000 ఉద్యోగాలు
  • ఆరేళ్లలో దశలవారీగా యూనిట్ నిర్మాణం, రూ.839 కోట్లతో 5 అనుబంధ పరిశ్రమలు
  • ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. అంతర్జాతీయ గృహోపకరణాల తయారీ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్, తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ నూతన ప్లాంట్‌కు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మే 8న భూమిపూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే ఆరేళ్లలో వివిధ దశల్లో మొత్తం రూ.5,001 కోట్ల పెట్టుబడి పెట్టాలని, తద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించాలని ఎల్జీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఎల్జీ సంస్థ శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌లో ప్రధానంగా ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్‌లతో పాటు ఇతర అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేయనుంది. అంతేకాకుండా, ఉత్పత్తులకు అవసరమైన కంప్రెసర్, మోటార్ కంప్రెసర్, హీట్ ఎక్స్ఛేంజర్ వంటి కీలక విడిభాగాలను కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే తయారుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాన యూనిట్‌తో పాటు, రూ.839 కోట్ల వ్యయంతో మరో ఐదు అనుబంధ యూనిట్లను కూడా రానున్న ఆరేళ్లలో నెలకొల్పనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

గత ఏడాది సెప్టెంబర్ లో ఎల్జీ కంపెనీ ప్రతినిధుల బృందంతో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వంటి అంశాలను వారికి వివరించారు. ప్రభుత్వ చొరవ, కల్పిస్తున్న సౌకర్యాల పట్ల సానుకూలంగా స్పందించిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రాష్ట్రంలో తమ యూనిట్‌ను స్థాపించేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు, రాయితీలను కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం మంజూరు చేయడం విశేషం.

రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, గత 11 నెలల్లో వివిధ సంస్థలతో సుమారు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు) కుదిరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్, టీసీఎస్, ఎన్టీపీసీ, టాటా పవర్, రిలయన్స్ సీబీజీ ప్లాంట్స్ వంటి ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ఇటీవల కృష్ణా జిల్లా మల్లవల్లిలో హిందూజా గ్రూప్ అశోక్ లేలాండ్ వాహన తయారీ యూనిట్ ఉత్పత్తిని ప్రారంభించగా, ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు కూడా భూమిపూజ జరిగింది. 

రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ)ని బలోపేతం చేసినట్లు అధికారులు తెలిపారు. అమెరికా, దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై పారిశ్రామికవేత్తలతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించి, వారిని ఆహ్వానించడంలో మంత్రి లోకేశ్ క్రియాశీలక పాత్ర పోషించారు.
Nara Lokesh
LG Electronics
SriCity
Andhra Pradesh
Investment
Electronics Manufacturing
Job Creation
Industrial Development
Rayalaseema
IT Minister

More Telugu News