Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం

Minister Kondapalli Srinivas and MLA Ganta Srinivasa Rao Escape Accident
  • కృష్ణాపురంలో ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన సభా వేదిక కూలిన ఘటన
  • ఫోటోల కోసం కార్యకర్తలు, స్థానికులు ఎగబడటంతో అపశ్రుతి
  • మంత్రి, ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న వైనం
రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఒక ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డారు. పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్క్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, కృష్ణాపురంలో రూ. 12.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఎంఎస్ఎంఈ పార్క్ పనులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈరోజు శంకుస్థాపన చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత, నాయకులతో ఫోటోలు దిగేందుకు కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా వేదికపైకి దూసుకువచ్చారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో జనం రావడంతో భారం తట్టుకోలేక సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే, అదృష్టవశాత్తూ మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటంతో అధికారులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు, ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుపై గంటా శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా స్పందించారు. "పద్మనాభం మండలం కృష్ణాపురంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించాం. ఇది ఉత్తరాంధ్రలోనే మొదటి ఎంఎస్ఎంఈ పార్క్" అని ఆయన పేర్కొన్నారు. మొదటి దశలో 21.72 ఎకరాల్లో 163 ప్లాట్లను విభజించామని, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 12.40 కోట్లు ఖర్చు చేస్తున్నామని గంటా వివరించారు. ఈ పార్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేలాది మంది గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన అనంతరం, పాండ్రంగి వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించినట్లు గంటా శ్రీనివాసరావు తన ఎక్స్ పోస్టులో తెలిపారు.
Ganta Srinivasa Rao
Kondapalli Srinivas
Visakhapatnam
MSME Park
Andhra Pradesh
Political News
Accident
Padmanabham
Krishnapur
Infrastructure

More Telugu News